Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై సోమవారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరిపిన ధర్నాకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి స్పందించారు. మంగళవారం ఆమె ఆసుపత్రిని సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలపై స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అఖిలపక్ష కమిటీ నాయకులతో ఆస్పత్రిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పిహెచ్సి ఆస్పత్రిని సిహెచ్సి ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి ఏండ్లు గడుస్తున్నా నేటికీ సరైన సదుపాయాలు సరిపడా డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించక పోవడం పట్ల అఖిలపక్ష కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో డాక్టర్లు సరిపడా లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీస సౌకర్యాలైన మంచినీరు, మందుబిల్లలు, ఫ్యాన్లు లేకపోవడం, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచకపోవడం, ప్రమాదాలలో గాయపడి ఆసుపత్రికి వచ్చిన రోగులకు కట్లు కట్టడంలో సిబ్బంది నిర్లక్ష్యం పట్ల వారు ప్రశ్నించారు. ఏ చిన్న సమస్య వచ్చినా సకాలంలో సరైన వైద్యం అందించక ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్ళమని చెప్పడం డాక్టర్లకు సిబ్బందికి పరిపాటిగా మారిపోయిందన్నారు. డాక్టర్ల కొరత, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం పట్ల విశ్వాసం కోల్పోయిన పేద ప్రజలు గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు చేసి అప్పుల భారంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాలలోని ఆర్ఎంపి డాక్టర్లు సైతం పేద ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని అవసరం లేని పరీక్షల పేరుతో అందినకాడికి దండుకుంటు న్నారన్నారు. తక్షణమే ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. ఆరుగురు డాక్టర్లకుగానూ నలుగురు మాత్రమే ఉన్నారని వీరిలో ప్రస్తుత వైద్యాధికారి సెలవులో ఉన్నారని, మరొకరు ట్రైనింగ్ నిమిత్తం వెళ్లారని, గతంలో ఆసుపత్రిలో జరిగిన ఘటనతో గైనకాలజిస్ట్‌గా ఇక్కడ పనిచేసేందుకు భయపడు తున్నారని, మరొకరు రిజైన్ చేయడం వల్ల డాక్టర్ల కొరతతో రోగులకు కొంత నష్టం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితి గత కొద్ది రోజుల క్రితం నుండే ఉందని డిసెంబర్ 1 నాటికి డాక్టర్లను సర్దుబాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రులో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావడం మంచిదేనని, సమాజ సేవలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మండల వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదటి డోసు తీసుకోవాల్సిన వారు 2360 మంది, రెండవ డోసు 3,000 మంది ఉన్నారన్నారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు అఖిలపక్ష కమిటీ వారు సహకరించాలని కోరారు. సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, నాయకులు ఏటుకూరి రామారావు, గుడవర్తి నాగేశ్వరరావు, సిపిఐ మండల కార్యదర్శి కర్నాటి భానుప్రసాద్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పగిడికత్తుల రామదాసు, బిజెపి నాయకులు మన్నే కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.