Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుకు కేసీఆర్ ప్రచార కర్త కావాలి
- గీతన్న బందు ఇవ్వాలి
- రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంలో కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల కుటుంబాల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలో మంచికంటి ఫంక్షన్ హాల్లో సంఘం జిల్లా అధ్యక్షుడు బోడ పట్ల సుదర్శన్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ తరతరాల నుండి వృత్తి చేస్తూ ప్రభుత్వానికి పన్నులు కడుతూ స్వయం ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ప్రభుత్వ లిక్కర్ పాలసీ వల్ల రోజు రోజుకి వృత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యనిషేధం అమలు చేయాలని అన్నారు. ప్రతీ సొసైటీకి 5 ఎకరాల భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ విధంగా డిసెంబర్ 10, 11 తేదీల్లో హైదరాబాదులో జరిగే కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి అంజయ్య, సీనియర్ నాయకులు బొల్లికొండ పాపయ్య, చిట్టి మొదు నాగేశ్వరరావు ,బొడ్డు నరసింహారావు, మొక్క నాగేశ్వరరావు, మరికంటి శ్రీను, కొండం కరుణాకర్, ఆలూరి కోటయ్య, మోట పోతుల వెంకటేశ్వర్లు, రెడ్డి మల్ల వెంకటయ్య, పొట్లపల్లి హుస్సేన్, జలగం వెంకట్రావు, శ్రీనివాసరావు, మరికంటి నాసర్ గౌడ్, పోలే బోయిన నరసింహారావు ఉన్నారు.