Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టు ఇలాకాలో పోలీసుల వైద్య సేవలు
- రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు
నవతెలంగాణ-చర్ల
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన మెగా వైద్య శిబిరం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ చర్ల మండలం మావోయిస్ట్ ప్రభావిత గ్రామం చెన్నాపురంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు జిల్లా ఎస్పి సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాల ప్రకారంగా భద్రాచలం ఏఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్ సీఐ బి.అశోక్, ఎస్ఐలు రాజు వర్మ, వెంకటప్పయ్య, పోలీస్ సిబ్బంది సహకారంతో మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. చెన్నాపురం, ఎర్రంపాడు, బత్తినపల్లి, బట్టిగూడెం, రామచంద్రాపురం ఆదివాసి గ్రామాల నుండి ప్రజలు సుమారు 850 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఐదు గ్రామాల్లోని 240 కుటుంబాలకు కుటుంబానికి ఒకటి చొప్పున దుప్పట్లను భద్రాచలం ఏఎస్పీ వినీత్, చర్ల పోలీసులు సీఐ బి అశోక్, ఎస్ఐలు రాజు వర్మ, వెంకటప్పయ్య అందించారు. అదే విధంగా ఈ గ్రామాల్లోని సుమారు రెండు నుండి తొమ్మిది సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు రెండు జతల చొప్పున మొత్తం 200 మంది పిల్లలకు దుస్తులను అందజేశారు.
అదేవిధంగా చిన్న పిల్లలలో యుక్తవయసు గల బాలబాలికల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి, నివారించే కార్యక్రమంలో భాగంగా మొత్తం 300 మంది బాలబాలికలకు, పిల్లలకు ప్రోటీన్ పౌడర్ ప్యాకెట్లను అందించారు. అంతేకాకుండా ఆదివాసి గ్రామాల్లో నెలకొన్న అనారోగ్య సమస్యలు, ప్రస్తుతం విజృంభిస్తున్న మలేరియా వ్యాధి నివారణకు భద్రాచలం ఏఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో భద్రాచలం నుండి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్లు కె విజరు (పెడియాట్రిక్స్), డాక్టర్ కోర సాయి ( పెడియాట్రిక్స్) డాక్టర్ లాస్య (ఎండి జనరల్), భద్రాచలం ఎస్పీ డాక్టర్ వినీత్ (ఎముకలు, కీళ్ళు నిపుణులు)లు ఐదు గ్రామాల నుండి వచ్చిన సుమారు 150 మంది పెద్దలకు, 200 మంది చిన్న పిల్లలకు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ను అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పర్యవేక్షించిన ఓఎస్డీ తిరుపతి, భద్రాచలం ఏఎస్పి డా.వినీత్ కార్యక్రమ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసిన పోలీసులు సీఐ అశోక్, ఎస్ఐలు రాజు వర్మ, వెంకటప్పయ్య, పోలీస్ సిబ్బందికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు విభాగం తరుపున జిల్లా ఎస్పి సునిల్ దత్త్ ఐపిఎస్ ప్రత్యేక అభినంధనాలు తెలియ జేశారు.
అదేవిధంగా భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి, సిబ్బందికి, స్పెషలిస్ట్ డాక్టర్లు కె విజరు, డాక్టర్ లాస్య, డాక్టర్ కోర సాయికు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పోలీసుల పట్ల ప్రభుత్వం పట్ల ఎంతో నమ్మకంతో ఉంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకి ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చిన ఐదు ఆదివాసి గ్రామ పటేల్‌లకు సర్పంచులకు, గ్రామ పెద్దలకు, మహిళలకు, గ్రామస్తులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఐదు గ్రామాల నుండి వచ్చిన సుమారు 850 మందికి చర్ల పోలీసుల ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించి తిరిగి వారి గ్రామాలకు పంపించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ పార్టీ సిబ్బంది పిఎస్ సిబ్బంది 141బి, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండర్ కమల్ వీర్, డిఎస్పి సుబిర్ మండల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది, స్పెషలిస్ట్ డాక్టర్లు కె విజరు, డాక్టర్ లాస్య, డాక్టర్ కోర సాయి లు పాల్గొన్నారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు మావోయిస్ట్‌ల కారణంగా ఇంతవరకు అభివృద్ధికి దూరంగా వుండి, మావోయిస్ట్‌ల చేత అనేక ఇబ్బందులకు, బలవంతపు దోపిడీకి గురవుతువచ్చారు. మావోయిస్ట్‌ల ప్రభావిత ప్రాంతాల్లో నూతన క్యాంప్‌ల నిర్మాణం జరుగుతూ వుండడం కారణంగా మారుమూల గ్రామాల ప్రజల్లో, ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్ధు ఆదివాసీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల ధైర్యం, నమ్మకం ఏర్పడి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు ఆదివాసీ గ్రామాల ప్రజలను మావోయిస్ట్ పార్టీ దళ సభ్యులు మీటింగ్‌ల పేరుతో బలవంతపు సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రజల నుండి బలవంతగా బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు దోపిడీ చెయ్యడం, మిరపకోతల కూలీ డబ్బుల నుండి, బీడి ఆకుల డబ్బుల నుండి వాటాలు వసూలు చెయ్యడమే కాకుండా, ఆదివాసీ మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందకుండా, వారికీ సరైన రోడ్లు, విద్యా, వైద్యం, తాగునీరు, ఇతర సదుపాయలు అందకుండా అడ్డుపడుతున్నారు. కానీ తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ మారుమూల ఆదివాసీల కోసం, వారి అభివృద్ధి కోసం, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువ అయ్యేటట్టు, ప్రజలు పోలీసులకి, ప్రభుత్వానికి చేరువ అయ్యే విధంగా అన్నీ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లా ఎస్పి సునిల్ దత్త్ తెలియ జేశారు.