Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ విపి గౌతమ్
నవతెలంగాణ- ముదిగొండ
రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమశాతం ఆధారంగా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఐకెపి సిబ్బందిని ఆదేశించారు.మండలపరిధిలో గోకినేపల్లి గ్రామంలో సోమవారం జిల్లా సిపి విష్ణు ఎస్వారియర్తో కలిసి ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రమును ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ధాన్యంలో ఉన్న తేమ శాతాన్ని వారు నిశితంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ విపి గౌతమ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంకు తీసుకువచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో ఇప్పటికే 245 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అవసరాన్ని బట్టి అదనపు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంతో మార్కెటింగ్ శాఖ, ఐకెపి, సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయని, వాతావరణం పరిస్థితులు అనుకూలించక పోవటం వల్ల కొనుగోలు కేంద్రంకు తీసుకొచ్చిన ధాన్యంలో తేమశాతం అధికంగా ఉంటుందని, తూర్పార పట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకరావాలని ఆయన రైతులకు సూచించారు. జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి ధాన్యంను మన కేంద్రాలకు తీసుకొస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వేరే రాష్ట్రాల రైతుల వలన మన రైతులు నష్టపోకూడదన్నారు. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌రావు, ఐకెపి ఏపిడి జయశ్రీ, తాసిల్దార్ తూమాటి శ్రీనివాస్, ఆర్ఐ ఏకవీర, మండల వ్యవసాయ అధికారి మందుల రాధ, ఏపీఎం గంగుల చిన్నవెంకటేశ్వర్లు, ఏఈఓ ఏ మౌనిక, ఐకెపి సిసి బి అనురాధ, ఐకేపీ గ్రామ సమైక్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.