Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) 21వ ఖమ్మం జిల్లా మహాసభలు ఆరంభం
- ప్రారంభించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరు
- స్ఫూర్తినిచ్చేలా పోరాట దృశ్యాల ఎగ్జిబిషన్
- ఆకట్టుకున్న ప్రజానాట్యమండలి ఆటపాట
- నేడు నూతన కార్యవర్గం ఎంపికతో ముగింపు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం ఎఫ్‌సీఐ రోడ్డు అరుణవర్ణ శోభితంగా మారింది. ఎర్రజెండా రెపరెపలతో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా 21వ మహాసభలు సోమవారం స్థానిక ఎంబీ గార్డెన్స్‌లోని వేదగిరి శ్రీనివాసరావు నగర్లో ప్రారంభమయ్యాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాసభలను ప్రారంభించారు. ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా 550 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. వీరితో పాటు మరో 500 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు. దాదాపు అందరూ ఎరుపురంగు దుస్తులు ధరించడం, సభా ప్రాంగణంలో ఎరుపుతోరణాలు, కమ్యూనిస్టు యోధుల వ్యాఖ్యలతో కూడిన ఎరుపురంగు ఫ్లెక్సీలతో ఎటుచూసినా అరుణవర్ణ శోభితమైంది. సభా ప్రాంగణంలోకి అడుగిడేందుకు ముందు నాలుగేళ్ల పోరాట దృశ్యాలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ స్ఫూర్తినిచ్చేలా ఉంది. మహాసభలకు అతిథులుగా వచ్చిన రాష్ట్ర నాయకులను ప్రజానాట్య మండలి బృందం కొలాట, డప్పు దరువులతో ర్యాలీగా ఆహ్వానించింది. సభలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఎటుచూసినా ఎర్రజెండా రెపరెపలాడింది. సభా ప్రారంభానికి ముందు పార్టీ సీనియర్ నాయకులు మామిళ్ల సంజీవరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహాసభల ఆహ్వానసంఘం గౌరవ అధ్యక్షులు రవిమారుత్, అధ్యక్షులు యలమంచిలి రవీంద్రనాథ్ ప్రతినిధులను ఉత్సాహ పరిచేలా ఉపన్యసించారు. 21వ మహాసభలకు హాజరైన ప్రతినిధులు, పెద్దలకు తమదైన శైలిలో ఆహ్వానం పలికారు. డబ్బు, మతం, కులంతో ఫాసిస్టు శక్తులు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో మార్క్సిస్టు ఉద్యమ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లే బృహత్తర బాధ్యత ప్రతినిధులపై ఉందని డాక్టర్ రవీంద్రనాథ్ స్ఫూర్తిదాయక స్వాగతం పలికారు. మతత్వరాజకీయ పార్టీలు, మితవాద బూర్జువ పార్టీలు పేట్రేగుతున్న తరుణంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుల వారసులుగా...పోరాట ప్రతినిధులుగా వచ్చిన మీకు స్వాగతమంటూ ప్రతినిధులకు స్ఫూర్తినిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు అతిథులను వేదిక మీదకు ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటేరియట్ జనరల్ కోఫీఅన్నన్, మాజీ లోక్‌సభా స్పీకర్ సోమనాథ్చటర్జి మొదలు మాజీ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కుంజాబొజ్జి, కట్టా వెంకటనర్సయ్య, అడ్వకేట్ కొండపల్లి ఉత్తమ్‌కుమార్, డాక్టర్ బుగ్గవీటి నర్సింహారావు, వేదగిరి శ్రీనివాసరావుతో పాటు అమరులైన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తల పేర్లను ప్రస్తావించారు. సభ వారందరికీ సంతాపం తెలుపుతూ మౌనం పాటించింది. కార్యదర్శి నివేదికను పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. నాలుగేళ్లలో పార్టీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సేవ కార్యక్రమాలు తదితర వివరాలు అందించారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ మహాసభల షెడ్యూల్‌ను అమలు చేసేందుకు మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మండలాల వారీగా చర్చలు నిర్వహించారు. నాలుగేళ్లలో ఉద్యమపార్టీగా నిర్మాణం, పోరాటాల గురించి ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు వివరిం చారు. ఉదయం 11 గంటలకు మొదలైన మహాసభలు రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. రాష్ట్ర కమిటీ నుంచి ఈ మహాసభల పరిశీలకులుగా తమ్మినేనితో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, పోతినేని సుదర్శన్, ఎం.సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తుల హైమావతి హాజరయ్యారు.
అననుకూల పరిస్థితుల్లో నిలబడేవాడే కమ్యూనిస్టు
: తమ్మినేని వీరభద్రం
అననుకూల పరిస్థితుల్లోనూ నిలబడే వాడే కమ్యూనిస్టు అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టు ఉద్యమం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. గత 30 ఏళ్లుగా ఇదే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమానికి కష్టాలు కొత్తేమీ కాదన్నారు. భూతల స్వర్గంలాంటి సోషలిస్టు దేశాలు 1990 నాటికి కుప్పకూలిపోయాయన్నారు. నాటి నుంచి అమెరికన్ సామ్రాజ్యవాదం మరింతగా విస్తరించిందన్నారు. కానీ నేటి విపత్కర సమయంలోనూ కమ్యూనిస్టు దేశం చైనా పురోగతి సాధిస్తుండటం గమనార్హం అన్నారు. మార్క్సిజం, లెనినిజాన్ని అమలు చేయడం వల్లనే ఆ దేశం అగ్రపథంలో ఉన్నట్లు అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలపడాన్ని బట్టి కమ్యూనిస్టు పాలన పురోగతికి సంకేతంగా చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై తిరుగుబాటు మొదలైందన్నారు. టీఆర్ఎస్ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రంలో మతోన్మాద బీజేపీ వేళ్లూనుకుంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సాగు చట్టాల రద్దుకు రైతాంగం చూపించిన పట్టుదల తదితర అంశాలను ఈ సందర్భంగా విశ్లేషించారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య, కాసాని ఐలయ్య, పాలడుగు భాస్కర్, బుర్రి ప్రసాద్, మచ్చా వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, ఎం.సుబ్బా రావు, మాచర్ల భారతి, రాష్ట్ర నాయకులు జి.ధర్మ, శోభన్‌నాయక్, మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వర్లు, బండి రమేష్, భూక్యా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.