Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్తుపల్లిలో ధాన్యం కొనుగోళ్లు షురూ..!!
నవతెలంగాణ- సత్తుపల్లి
ధాన్యం కొనుగోళ్ల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఫోన్చేయడం, నత్తనడకన కొనుగోళ్లు జరుగుతున్నాయని, సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడటం, మిల్లర్ల నిర్లక్ష్యం తదితరాంశాలపై ఎమ్మెల్యే సండ్ర సీఎంకు వివరించిన నేపధ్యంలో ధాన్యం కొనుగోళ్లు షురూ అయ్యాయి. ఒక్క రామానగరం మినహా మండలంలోని నారాయణపురం, బేతుపల్లి, గంగారం, సిద్దారం, సదాశివునిపాలెం, సాకలగూడెం, కాకర్లపల్లి, కిష్టారం గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఎమ్మెల్యే సండ్రతో సీఎం కేసీఆర్తో మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్, సివిల్ సప్లయీస్ అధికారులకు ముఖ్యమంత్రి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ తరువాత తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో జిల్లా అదనపు కలెక్టర్, సివిల్ సప్లయీస్ జిల్లా అధికారులు బుధవారం సత్తుపల్లి మండలంలోని పలు ధాన్యం కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. నారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దారు కేవీఎంఏ మీనన్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తుంబూరు కృష్ణారెడ్డి, గంగారం సొసైటీ అధ్యక్షుడు మందపాటి వెంకటరెడ్డి, సర్పంచ్ దేశిరెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.