Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి : సీఐటీయు
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వర్కర్లకు కనీస వేతనం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి దానిపై 30 శాతం పీఆర్సీ అమలు చేయాలని, వర్కర్లకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు తుమ్మ విష్ణు వర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఖమ్మం రూరల్ మండల మహాసభ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సభలో విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ వర్కర్లతో వెట్టి చాకిరి చేయించుకుంటూ సరైన వేతనాలు ఇవ్వకపోవడం హేయమైన చర్య అన్నారు. మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి సీనియర్లను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ పంచాయతీ వర్కర్లను జూనియర్ జూనియర్ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు ఈ ఎస్ఐ,పియఫ్ కల్పించాలని,50 లక్షలు ప్రమాద బీమా కల్పించాలని, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని,ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని, రండు జతల యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమళ్ళపల్లి మోహన్ రావు, మండల కన్వీనర్ మెడికొండ నాగేశ్వరరావు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు పల్లి రాములు, వాసం రాంబాబు, పెద్ద పొంగు సైదులు, నాగరాజు, ప్రభాకర్, ఉపేందర్ చౌదరి, ఉపేందర్, క్రాంతి, నాగేశ్వరరావు, అనురాధ, విజయారెడ్డి, మధు, కృష్ణ, మహేష్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.