Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కల్లాల్లో కల్లోలం సృష్టిస్తూ... అదే విషయంపై పార్లమెంట్లో పదం కూడా పలకరా? అని తెలంగాణ బీజేపీ ఎంపీల ద్వంద వైఖరిపై టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. రైతులకు ప్రయోజనాలను చేకూర్చే విషయంలో రాజకీయాలొద్దని హెచ్చరించారు. రైతాంగం సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి రాష్ట్ర బీజేపీ నేతలు కలిసి రావాలని సూచించారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతులు పండిస్తున్న పంటపై ప్రత్యేకంగా దష్టి సారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. తమ రాష్ట్ర రైతాంగ ఇబ్బందులు, పంట కొనుగోలుకు సంబంధించిన ప్రధాన సమస్యను ఈనెల 28న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ముందస్తుగా జరిగిన అఖిల పక్షం సమావేశంలో చెప్పామని తెలిపారు. ముందస్తు గానే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినా, పార్లమెంట్లో రైతు సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ కూడా అటు లోక్‌సభలో... ఇటు రాజ్య సభలో అందరూ ఎంపీలం ఆందోళన చేస్తున్నామని గుర్తు చేశారు. పంట కొనుగోలుపై ఒక్కొ బీజేపీ నేత ఒక్కో విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి రైతు సమస్యలను వివరిస్తున్న క్రమంలో మైక్ కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తాను తెలంగాణ రైతుల డిమాండ్‌ను లేవనెత్తే క్రమంలో టీ బీజేపీ నేతలు అనరాని మాటలు పార్లమెంట్ సాక్షిగా తమను అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల కోసం వాటన్నింటిని భరించామన్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభలో, రాజ్యసభలో వాకౌట్ చేసి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసినట్లు తెలిపారు. కనీస బాధ్యతగా తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకుని సమావేశం పెడితే అందులో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని లేదా కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పార్లమెంట్లో సంబంధిత మంత్రి ద్వారా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేకూరేంత వరకు పోరాటం ఆపేది లేదని మరోమారు స్పష్టం చేశారు. ఎందుకంటే, ధాన్యం సేకరించే బాధ్యత కేంద్రానిదే అని ఆయన స్పష్టం చేశారు.