Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వైరా టౌన్
ఠాగూర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో సోమవరం గ్రామంలోని మిట్టపల్లి శ్రీనివాసరావు మామిడి తోటలో గురువారం ఘనంగా వనసమారాదన నిర్వహించారు. ఠాగూర్ విద్యా సంస్థల చైర్మన్ సంక్రాంతి సునీత పూజచేసి వనసమారాదన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఠాగూర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ ఈనాడు వనభోజనాలు కుల భోజనాలుగా మారాయని, వివిధ కులాల పేరుతో వనభోజనాలు నిర్వహిస్తున్నారని అన్నారు. కుల భోజనాలు వలన జాతీయ సమైక్యతకు నష్టమని, కుల మతాలకు అతీతంగా ఠాగూర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రకృతిని సంరక్షించాల్సిన అవసరం చాలా ఉందని, ప్రకృతిని కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షంచాలని కోరారు. ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు తాటిపల్లి సుధీర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలతో కూడిన సామాజిక స్పృహను నేర్పటంలో ఠాగూర్ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ముందు ఉంటాయని అన్నారు. ఠాగూర్ విద్యాసంస్థలో విద్యను అభ్యసించడం వలన తను ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నానని, విద్యార్థులు ఇలాంటి ఉత్తమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని సూచించారు. ఉత్తమ విద్యను అందించడంతోపాటు పలు విధాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఠాగూర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ కు విద్యార్థుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జానపద కళాకారుడు కే. జాన్ బృందం పాడిన పాటలు, ఆడిన ఆటలు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ విద్యా సంస్థల చైర్మన్ సంక్రాంతి సునీత, కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్, డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత, ప్రిన్సిపల్ చింతనిప్పు కృష్ణారావు, పుచ్చకాయల రామకృష్ణ, నాగనబోయిన లింగరావు, గుంటుపల్లి కృష్ణ, ఎస్.కె మజీద్ తదితరులు పాల్గొన్నారు.