Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్వగృహ ఇళ్లను పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
అ స్వగృహ ఇళ్లపై ప్రయివేట్ టెండర్లు పిలిస్తే అడ్డుకుంటాం
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఖమ్మం రూరల్ పరిధిలోని సుమారుగా పది సంవత్సరాల క్రితం నిర్మించిన 756 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ లను వెంటనే మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం నిర్మానుష్యంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది ప్రజా సొమ్ముతో నిర్మించిన గృహాలు చిరుద్యోగులకి కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ అందించకుండా దశాబ్దాలుగా వదిలివేయటం సరైంది కాదన్నారు. ఖమ్మం నగరంలో అనేక మంది మధ్య తరగతి ప్రజలు సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నిర్మించిన ఇళ్లను శిథిలావస్థకు చేరుకున్న కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. ఇవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని వారు తెలిపారు. తక్షణమే అర్హులైన వారికి అందించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు పిలిచి అప్పనంగా అప్పచెప్పే ప్రక్రియ చేస్తే టెండర్ ప్రక్రియను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. దశలవారీగా ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, వై. విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు నడ్ర ప్రసాద్, ఎం.ఎ జబ్బార్, ఎస్. నవీన్ రెడ్డి, దొంగల తిరుపతిరావు, త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీను, అర్బన్ మండల కార్యదర్శి బత్తిని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.