Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డార్మేటరీస్ ఎందుకు పూర్తి కాలేదు
అ కాంట్రాక్టర్ కు ఎంత బిల్లు చెల్లించారు
అ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టలేదు
అ గురుకుల పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్ గౌతం
నవతెలంగాణ-వైరా
ఖమ్మం జిల్లా వైరా, తల్లాడ, కల్లూరు మండలాల్లో గురువారం కలెక్టర్ పీవీ గౌతమ్ పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పాఠశాలలు, నర్సరీలను తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనుల్లో అలసత్వం ప్రదర్శించిన కాంట్రాక్టర్లను మందలించారు.
వైరాలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, రాష్ట్ర గురుకుల పాఠశాలను గురువారం కలెక్టర్ వీపీ గౌతమ్ సందర్శించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2017 లో మంజూరై 2019లో పని ప్రారంభించిన డార్మేటరీస్ ఎందుకు పూర్తి కాలేదని ఈఈని ప్రశ్నించారు. దీని మొత్తం ఎస్టిమేషన్ ఎంత? కాంట్రాక్టర్ చేసిన పని ఎంత, అతనికి చెల్లించిన బిల్ ఎంత అన్న వివరాలకు ఈఈ సమాధానం ఇస్తూ మొత్తం 4 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అని ఇప్పటికీ 1.40 లక్షల పని చేశాడని,అతనికి ఇప్పటికి 1.5 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అయితే పని ఎందుకు ఆపాడని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టారా అని ప్రశ్నించారు. పెట్టలేదని ఈఈ చెప్పటంతో కలెక్టర్ వెంటనే అతనిని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. మొత్తం పాఠశాలలో వాడుతున్న వాడకం నీరు బయటకు వెళ్ళకుండా గ్రామస్థులు అభ్యంతరం తెలుపుతున్నారని ప్రిన్సిపాల్, సిబ్బంది చెప్పటంతో గ్రామస్థులకు ఎందుకు అభ్యంతరం ఈ విషయాన్ని పరిశీలించాలని తహసీల్దార్ నారాపోగు అరుణను ఆదేశించారు. పాఠశాల ఆవరణ మొత్తాన్ని క్లీన్ చేయించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలో టారు లెట్ల సమస్య, ఇప్పుడున్న డార్మేటరీస్పై కప్పు నుండి స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నట్లు ప్రిన్సిపాల్, సిబ్బంది కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం రాష్ట్ర గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఇటీవల కరోనా బారిన పడిన విద్యార్థులను గురించి ప్రిన్సిపల్ ను ప్రశ్నించగా వారంతా వారి వారి ఇళ్ల వద్దే ఉన్నారని ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని కలెక్టర్ ప్రశ్నించగా 161 మంది ఉన్నారని, మొత్తం 615 మంది ఉన్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులను వారి తల్లి దండ్రులు అడిగినా సరైన కారణం లేకుండా ఇండ్లకు పంపవద్దని, కరోనా దృష్ట్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ క్లాస్ రూం లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి మాస్క్ ధరించారా లేదా అన్న విషయం గమనించారు. పాఠశాల విద్యార్థులకు కరోనా టెస్టు కిట్లు ఇవ్వాలని, పాఠశాలలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ కు శిక్షణ ఇవ్వాలని పిహెచ్సి డాక్టర్ ను ఆదేశించారు. ఆర్ అండ్ బి డిఈఈని ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించగా డిపార్ట్మెంటల్ మీటింగ్‌లో ఉన్నందున ఆలస్యం అయిందని సమాధానం ఇవ్వగా వెంటనే ఆర్ అండ్ బి ఉన్నతాధికారులకు ఫోన్ చేయటంతో అసలు మీటింగే లేదని చెప్పటంతో డిఈఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వైరా లోని రెండు గురుకుల పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నానని, గురుకులంలో కరోనా భారీన పడిన విద్యార్థులకు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసినట్టు చెప్పారు. విలేకరులు కూడా కొన్ని జాగ్రత్త లు తీసుకుని వార్తలు రాయాలని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడి పోయెంతగా రాయటం వలన పాఠశాలలు మూత పడేస్తితి వస్తుందని అన్నారు. విద్యార్థినులను ప్రభుత్వం డిక్లేర్ చేసిన సెలవులకే ఇళ్లకు పంపాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. ఆయన వెంట ఎంపిడిఓ ఎన్.వెంకట పతి రాజు, తహసీల్దార్ అరుణ, మండల ప్రత్యేకాధికారి కస్తాల సత్యనారాయణ, వ్యవసాయాధికారి ఎస్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి : జిల్లా కలెక్టర్
వైరా మండలంలో తను ఏలాట్ చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ గౌతమ్ మండల వ్యవసాయాధికారి ఎస్.పవన్ కుమార్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం డిసిఎంఎస్ ఆధ్వర్యంలో విప్పలమడక గ్రామంలో కొనుగోలు కేంద్రం నడిపి ఈ ఖరీఫ్ సీజన్లో కేంద్రం ప్రారంభించటం లేదని విలేకరులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నేను ఎలాట్ చేసిన కేంద్రాల లిస్టును ఏఒ నుండి తీసుకుని పరిశీలించారు. విప్పలమడక పెద్ద గ్రామమని ముందుగానే వరి కోతలు ప్రారంభం అవుతాయని, ధాన్యం పంట కూడా బాగా ఉంటుందని దూర ప్రాంతానికి తరలించడం కష్టంగా ఉంటుందని, విప్పలమడకలో కేంద్రం ప్రారంభించటం ద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని విలేఖరులు కోరగా విప్పలమడక లింగన్నపాలెం గ్రామాల మధ్య దూరం ఎంత అని ప్రశ్నించారు. ఒక కిలోమీటర్ అని చెప్పగా కిలోమీటర్ దూరం సమస్య కాబోదని అన్నారు.ఏలాట్ చేసిన కేంద్రాలన్నీ జాగ్రత్తగా నడపాలని ఆదేశించారు.
తల్లాడ : మండల పరిధిలోని రేజర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. గన్నీ సంచులు అవసరమైనన్ని సిద్ధంగా ఎందుకు ఉంచులేదని, ధాన్యం మిల్లులకు చేర్చకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. 400 నుండి 500 టన్నుల ధాన్యాన్ని రేజర్ల కేంద్రం నుండి ఖరీదు చేశామని మరో 700 టన్నులు ఖరీదు చేస్తామని అధికారులు తెలిపారు. శుభ్రమైన ధాన్యాన్ని తీసుకొని వస్తే మూడు శాతం కటింగులు నివారించవచ్చు రైతులకు సూచించారు. రెవెన్యూ అధికారులు ప్రతిరోజు మిల్లులను సందర్శించి ఎంత మేరకు కొనుగోలు చేశారని ఆరా తీయాలన్నారు. మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. మాయిశ్చరైజర్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ, తహసీల్దార్ గంట శ్రీలత, ఎంపీడీవో బిబి రవీందర్ రెడ్డి, ఎస్సై ముప్పు సురేష్, రైతులు పాల్గొన్నారు.
పార్క్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలి
తల్లాడ పార్క్‌ను, నర్సరీని కలెక్టర్ గౌతమ్ సందర్శించారు. పార్క్ నిర్వహణ బాగుందని పార్కుకు వచ్చే వారికి సౌకర్యంగా నడకదారి ఏర్పాటు చేయాలని, ఆర్ అండ్ బి రోడ్డు వద్ద బోర్డు ఏర్పాటు చేసి ప్రజలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్సరీని సందర్శించి బ్యాగులో మట్టి ఎలా పోస్తున్నారని కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఓ బ్యాగ్ పట్టుకొని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లో డీఆర్డిఎ పిడి విద్యా చందన, తహసీల్దార్ గంటా శ్రీలత, ఎంపీడీవో బి రవీందర్ రెడ్డి, ఎంపీఓ శ్రీదేవి, గ్రామ పంచాయతీ ఈవో జి సీతారాములు, సర్పంచ్ కి సంధ్యారాణి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొని తల్లాడ పోలీస్ స్టేషన్ కు తిరిగి వస్తున్న ఎస్ ఐ ఏం సురేష్ బియ్యం రోడ్డుపై పడి ఉండటంతో వివరాలు అడిగి తెలుసుకొని మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపాడని డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.