Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ వ్యూహం
నవతెలంగాణ-బోనకల్
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించేందుకు టిఆర్ఎస్ అప్పుడే నజరాలు ప్రకటిస్తుంది. గులాబీ కండువా కప్పికోండి, మూడు లక్షల రూపాయల నజరానా పొందండి అంటూ ఊరూరు టిఆర్ఎస్ నాయకులు తిరుగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బోనకల్ మండలంలో 13 ఓట్లు ఉన్నాయి. ఈ 13 ఓట్లలో సిపిఐకి చెందిన మరీదు నరసింహారావు (మోటమర్రి ఎంపీటీసీ) అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 12 ఓట్లలో సిపిఎంకు 5 కాంగ్రెస్ కు మూడు టీఆర్ఎస్ కు 4 ఓట్లు ఉన్నాయి. మధిర నియోజకవర్గంలో ఓట్ల బలాబలాల ఆధారంగా ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. అయినా టిఆర్ఎస్ నాయకులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎంపీటీసీలకు రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు ఒక్క పైసా నిధులు కూడా ఇవ్వలేదు. దీంతో రాజకీయాలకతీతంగా ఎంపీటీసీల అందరిలోనూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యతిరేకత వలన టిఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే భయంతో అప్పుడే క్యాంపుల కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే మధిర నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్లను గోవా తరలించారు. టిఆర్ఎస్కు చెందిన ఓటర్లను గోవా తరలించి, ప్రతిపక్షాలకు చెందిన ఓటర్లపై గాలం వేస్తున్నారు. బోనకల్ మండలంలో గల 12 ఓట్ల కోసం పెద్ద ఎత్తున బేరసారాలకు దిగుతున్నారు. ఒక్కొక్క ఎంపీటీసీకి టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది పంచుకొని బేరసారాలకు దిగుతున్నారు. పగలు అయితే ఆయా పార్టీలకు చెందిన వారు గమనిస్తున్నారనే ఉద్దేశంతో రాత్రి సమయంలో డబ్బుల సంచులతో బేరసారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీటీసీ వద్దకు వెళ్లి గులాబీ కండువా కప్పుకో మూడు లక్షల రూపాయలు తీసుకో అంటూ బేరానికి దిగారు. దీంతో ఆ ఎంపీటీసీ తాను గులాబీ కండువా కప్పుకోను మూడు లక్షల రూపాయలు అవసరం లేదంటూ స్పష్టం చేయడంతో బిక్కమొహం వేసి టిఆర్ఎస్ నాయకులు వెళ్లిపోయారు. మూడు లక్షల రూపాయలతో తన జీవితం పూర్తిగా మారిపోదని, తాను బతికున్నంత కాలం ఆ మచ్చ తన మీద ఉంటుందని, తనకు అలాంటి డబ్బులు అవసరం లేదని వారికి ఎంతో నిజాయితీగా కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేశాడు. ''మీ పార్టీలో ఉంటే మీ పదవి కాలం పూర్తయ్యేవరకు ఒక్క పైసా కూడా రాదని మా పార్టీలోకి వస్తే నీకు డబ్బులు, పదవులు వస్తాయి'' అంటూ ఆశలు రేకెత్తిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యేవరకు తమ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీల ఓటర్లను కొనుగోలు చేసే పనిలోనే ఉంటారని, ఆ పార్టీ నాయకులు కొంతమంది వ్యాఖ్యానించడం విశేషం.