Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు అన్నారు. ఆదివారం ఖమ్మం సుందరయ్య భవనంలో యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సిపిఎం ఆగ్జలరీ గ్రూపు ఆర్గనైజర్లు, మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోడీ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారని, దేశంలో రైతు, కార్మిక, ప్రజా హక్కులకు భంగం కలిగేలా చట్టాలు తెస్తున్నారన్నారు. మోడీ సర్కార్ మెడలు వంచి మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయించడంలో రైతులు చరిత్ర సృష్టించారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తూ, దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతుందని, కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలు తెస్తుందని, వాటిని ఎదుర్కోవడానికి సిద్దం కావాలని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్ పోరాటాలకు ఢిల్లీ రైతాంగ పోరాటం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కెసిఆర్ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను గాలికి వదిలివేసి పబ్బం గడుపుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో వడ్లు కొనుగోలు విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప, రైతులకు న్యాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదని అన్నారు. టిఆర్ఎస్, బిజెపిలు ఢిల్లీలో దోస్తానా, గల్లీలో దుష్మని అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వానా కాలం వడ్లు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ నెల 7వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు మద్ధతు తెలియజేస్తూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, మాచర్ల భారతి, జిల్లా కమిటి సభ్యులు ఎస్.నవీన్‌రెడ్డి, నండ్ర ప్రసాద్, కొమ్ము శ్రీను, సుంకర సుధాకర్, దొండపాటి నాగేశ్వరరావు, వాసిరెడ్డి వరప్రసాద్, శీలం నర్సింహారావు, మండల కార్యదర్శులు కె.నరేంద్ర, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.