Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పినపాక
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని పోట్లపల్లి గ్రామాన్ని సందర్శించి రైతులకు ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే యాసంగిలో వరిపంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ పంటలకు ఎక్కువ దిగుబడి, లాభం చేకూరుతుందని రైతులకు సూచించారు. వరి ధాన్యం కొనుగోలు చేయబోదని భారత ఆహార సంస్థ ఆదేశాలు జారీ చేశారని రైతులకు వివరించారు.
ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులకు మండల అధికారులు పలు సూచనలు చేసినట్లు రైతులకు తెలియజేశారు. రైతులెవ్వరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. 100శాతం వ్యాక్సిన్ పూర్తయ్యేలా చూడాలని వైద్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కళ్యాణి, జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు, అదనపు వ్యవసాయ సంచాలకులు తాతారావు, తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.