Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ఏ భాషలో చెబితే తెలంగాణ రైతాంగ బాధ కేంద్ర ప్రభుత్వానికి అర్ధమవుతుందని టీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. తమ రాష్ట్ర రైతుల జీవన్మరణ సమస్య అయినటువంటి వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఇటు గల్లీలో... అటు ఢిల్లీలో నినదించాం, నిరసన తెలిపాం... అరిచాం.. ఆందోళన చేశామని చెప్పారు. తమ సమస్యను హిందీలో చెప్పామని... తెలుగులో వివరిం చామని... ఇంగ్లీష్ స్పష్టం చేసినా బీజేపీ ద్వంద వైఖరి కారణంగా తమ పోరాటం ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని నినదిస్తూ నిరసన తెలిపామన్నారు. పార్లమెంటు లోపలా, బయటా ఆందోళన చేశామన్నారు. ఇలా అన్ని రకాలుగా టీఆర్ఎస్ ఎంపీలందరూ కలిసి తెలంగాణ రైతాంగం సమస్య పరిష్కారానికి పోరాటలు చేస్తూ వచ్చామని వివరించారు. అయినా తెలంగాణ రైతుల గోస కేంద్రానికి అర్ధంకావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఏడో రోజుల సమావేశాల్లో ఏడు విధాలుగా నిరసన తెలిపామన్నారు. మంగళవారం ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో ఎంపీ నామ నాగేశ్వరరావు నేతత్వంలో మిగిలిన టీఆర్ఎస్ ఎంపీలు నల్లచొక్కాలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. వరిధాన్యానికి కనీస మద్దతు ధర... సమగ్ర జాతీయ ధాన్యం సేకరణ విధానం పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని పట్టుపట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. అయితే, టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తిపై స్పీకర్ ఓంబిర్లా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా తెలంగాణ రైతాంగం కోసం పార్లమెంట్ వేదికగా తాము ఆందోళన చేస్తుంటే కేంద్రానికి పట్టడంలేదని ఆగ్రహాం వ్యక్తం చేస్తు పార్లమెంట్ సమావేశాలను బారు కాట్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామ నాగేశ్వరరావు ప్రకటించారు. అనంతరం ఆయన తన ఎంపీలతో కలిసి బయటకు వచ్చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో జరిగిన విలేఖరుల సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావుతో కలిసి టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా గత వారం రోజులుగా రైతాంగం సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేసినా బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరిగిందని అది కొంటారా? కొనరా? అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. రబీలో ఎంత ధాన్యం కొంటారు అని అడిగిన ప్రశ్నకు కేంద్రం డొంక తిరుగుడు సమాధానాలు చెబుతుందన్నారు. అడుగడుగునా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియలో భాగంగా ఆహార భద్రత, ఎఫ్ సీఐ, రైల్వే తదితర అంశాల్లోనూ కావాల్సిన సదుపాయాలను అందజేయకుండా వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.