Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
ప్రజా ఉద్యమ కేంద్రాలుగా సీపీఐ(ఎం) కార్యాలయాలు ఉపయోగపడాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి కార్యాలయ నిర్మాణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడంలో యాసంగిలో వరి సాగు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్ర గందరగోళానికి గురి చేయడం దారుణమన్నారు. వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల బారినపడి మోస పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యాసంగిలో రైతులు వరి సాగు చేయవద్దని చెప్పడం రైతులను వ్యవసాయానికి పూర్తిగా దూరం చేయడంలో భాగమేనన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించి వరి సాగు చేయవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. వరి సాగు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రస్తుతం వాన కాలంలో రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కేవీ రామిరెడ్డి, ఏటుకూరి రామారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, మన్నేపల్లి రమేష్, మహేష్ ఉన్నారు.