Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
అ నాయకులను అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ-టేకులపల్లి
బొగ్గు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోయగూడెం ఓసీలో వివిధ సంఘాల నాయకులు చేపట్టిన మొదటి రోజు సమ్మె గురువారం విజయవంతమైంది. కార్మిక సంఘాల నాయకులు రేపాకుల శ్రీనివాస్, బానోత్ ఊక్లా, గుగులోత్ రామచందర్, ధర్మపురి వీరబ్రహ్మ చారిల ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల మొదటి రోజు సమ్మెను కేఓసీలో వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రధాన గేటు వద్ద టేకులపల్లి ఎస్ఐ ఇమ్మడి రాజ్ కుమార్ నాయకులను అడ్డుకున్నారు.
అదేవిధంగా లారీ అసోసియేషన్ అధ్యక్షులు బానోతు రామాకు వివిధ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం కోయగూడెం ఓపెన్ కాస్ట్లో పనులు చేస్తున్న ప్రైవేట్ కంపెనీల కాంట్రాక్ట్ కార్మికులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసం నరసింహారావు, సీఐటీయు మండల కన్వీనర్ కె.వీరన్న, సురేష్, నాగేంద్రబాబు, చిట్టిబాబు, రామయ్య, శ్రీను, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఇల్లందు : బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటిరోజు గురువారం సమ్మె సక్సెస్ అయింది. మొదటి షిప్టులో మొత్తం కార్మికులు 492కు గాను 415 మంది గైర్ హాజర్ అయ్యారు. సింగరేణి సమ్మెలో పాల్గొన్న కార్మికులకు సంపూర్ణంగా కాంట్రాక్ట్ కార్మికులు తమ విధులు బహిష్కరించి సమ్మె విజయవంతం చేసిన కార్మికులకు కార్మిక జేఏసీ విప్లవ జేజేలు తెలిపింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ నేతలు తాలూరు కృష్ణ, షేక్ యాకుబ్ షావలి, శంకర్, కోటయ్య, శ్రీను, బంధం నాగయ్య, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణ నిలిపివేయాలని సింగరేణిలో సమ్మె ప్రారంభమైంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో 3 రోజుల సమ్మెలో భాగంగా మణుగూరులో మొదటిరోజు బొగ్గు ఉత్పత్తి స్థంభించింది. ఈ సందర్భంగా సింగరేణి జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా భావించే సింగరేణి నాలుగు బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా 72 గంటల సమ్మెను ప్రారంభించారన్నారు. మణుగూరు ఏరియాలో రోజుకు 3వేల 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి స్థభించిందన్నారు. పర్మినెంట్, కాంట్రాక్టు అన్ని విధాల కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గోని విజయవంతం చేశారు. ఇదే స్ఫూర్తితో మరో రెండు రోజుల సమ్మెను నిర్వహించాలని జేఏసీ జేజేలు పలికింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు రోజు ఉత్పత్తిచేసే 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియూ కార్మిక సంఘాల నాయకులు వల్లూరి వెంకటరత్నం, టివిఎంవి ప్రసాద్, రాంమూర్తి, ఈశ్వరరావు, రాంగోపాల్, వీరస్వామి, లక్ష్మణ్‌రావు, బుచ్చిరెడ్డి, విల్సన్‌రాజు, బొల్లం రాజు, ప్రభాకరరావు, జాన్, రవీందర్రావు, కాంట్రాక్టు కార్మికుల సంఖ్యలు, తదితరులు పాల్గొన్నారు.