Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడం, ప్రయివేటుకు కట్టబెట్టడాన్ని నిలపాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘాలు, కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా 3 రోజుల సమ్మె ప్రారంభమైంది. గురువారం మొదటిరోజు సమ్మె ఉధృతంగా సాగింది. జాతీయ కార్మిక సంఘాలు సీఐటీయూ, ఐఎన్టియూసీ, ఏఐటియూసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (టిబిజికేఎస్) కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమ్మె విజయవంతమైంది. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, కోయగూడెం, మణుగూరు, ఖమ్మం జిల్లా పరిధిలోని సత్తుపల్లి భూగర్భ, ఉపరితల గనుల్లో (ఓసీ) బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. బొగ్గు ఉత్పత్తి జరుగలేదు. నూరు శాతం కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా విధులకు వచ్చే అధికారులను ఆందోళనకారులు అడ్డుకున్నారు.
సింగరేణి వ్యాప్తంగా 3 రోజుల సమ్మె పిలుపునిచ్చిన నేపథ్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి గనుల వద్ద కార్మికులు, సింగరేణి ప్రధాన కార్యాలయం గేటు వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ స్థాయి అధికారులు సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సైతం అడ్డుకున్నారు. ఆందోళనకారులు చేతులెత్తి మొక్కుతూ అధికారులు విధులకు హాజరు కావద్దని వేడుకున్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసమే 3 రోజుల సమ్మె జరుగుతుందని విన్నవించారు. సింగరేణిలో ప్రైవేటీకరణ జరిగితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో హెచ్చరించారు. దీంతో అధికారులు సైతం ఆందోళనకారులకు సహకరించి తిరిగి వెళ్లిపోయారు. ప్రధాన కార్యాలయంలో అధికారులు ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు సహకరించడంతో ప్రధాన కార్యాలయం బోసిపోయి కనిపించింది.
జీఎం బసవయ్య అడ్డుకున్న ఆందోళనకారులు
సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు జరుగుతున్న ఆందోళనల సందర్భంగా సమ్మెను విచ్ఛిన్నం చేసి విధులకు హాజరయ్యేందుకు వచ్చిన సింగరేణి జనరల్ మేనేజర్ సిఎస్ఆర్ కె.బసవయ్యను ఆందోళనకారులు ఆయనను గేటు ముందు నిలిపి వేశారు. విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మూడు రోజుల సమ్మె చేస్తున్నది కార్మికుల కోసం కాదని, సంస్థ పరిరక్షణ కోసమని చెప్పారు. విపత్కర పరిస్థితిలో విధులకు హాజరు కావడం సరికాదని హెచ్చరించారు. అనంతరం జీఎం వెనుదిరిగి వెళ్లిపోయారు.
నిలిచిపోయిన భారీ వాహనాలు
సింగరేణి ఓపెన్ కాస్ట్ల్లో అధికంగా బొగ్గు తీసే భారీ వాహనాలు, యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడు రోజుల సమ్మె ప్రభావంతో మొదటిరోజు డోజర్, డంపర్లు ముందుకు కదల్లేదు. ఓపెన్ కాస్ట్ క్వారీలో నిలిచి పోయాయి. మొదటిరోజు సమ్మె విజయవంతం కావడంతో కార్మికులు ఉత్సాహంగా ఉన్నారు. రెట్టింపు ఉత్సాహంతో రెండవ రోజు శుక్రవారం సమ్మెలో పాల్గొంటారని తెలుస్తుంది. సింగరేణి కార్మికుల మూడు రోజుల సమ్మె కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టాయి.
మొదటిరోజు సింగరేణి సమ్మెలో పాల్గొన్నా కార్మిక సంఘాల నాయకులు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందార నరసింహారావు, విజయ గిరి శ్రీనివాస్, జి.రాజా రావు, కర్లవీర స్వామి, భూక్యా రమేష్, డి.వీరన్న, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు త్యాగరాజన్, కాలం నాగభూషణం, ఏఐటీయూసీ నాయకులు దమ్మాలపాటి శేషయ్య, గుత్తుల సత్యనారాయణ, వెంకట్, హెచ్ఎంఎస్. నాయకులు బివి.రమణ రావు, రఘు, బీఎంఎస్ నాయకులు మాధవ నాయక్, ప్రభాకర్, టీజిబి కేఎస్ నాయకులు రజాక్, కాపు కృష్ణ ,సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.