Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో ధ్వంసమైన విద్యుత్ మోటార్లను కాంగ్రెస్ నాయకులు గురువారం పరిశీలించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మూడు విద్యుత్ మోటార్లను, డెలివరీ పైపులను, స్టార్టర్ బాక్సులను ధ్వంసం చేశారు. గత సంవత్సరం కూడా ఇద్ఱేవిధంగా 11 మంది రైతుల విద్యుత్ మోటార్లను కూడా ధ్వంసం చేశారు. విద్యుత్ మోటార్లను ధ్వంసం చేయటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాటి మరమ్మతుల కోసం వేలాది రూపాయలు ఖర్చుచేసి కొంతమంది రైతులు మరమ్మతులు చేయించుకున్నారు. మరికొంత మంది రైతులు కొత్త మోటార్ల ను తెచ్చుకున్నారు. వ్యవసాయం సాగుతున్న సమయంలో పంటలకు నీరు పెట్టే దశలో మోటార్లను ధ్వంసం చేయడం వల్ల చేతికి వచ్చిన పంట సైతం చేతి రాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధ్వంసం చేసిన మోటార్లు అన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు చెందినవి కావడం విశేషం. కిసాన్ సెల్ మండల అధ్యక్షులు, కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. గత ఏడాది కూడా ఇదే రకమైన చర్యలకు పాల్పడ్డారని మరల అదే విధంగా ఈ ఏడాది కూడా విద్యుత్ మోటార్లను ధ్వంసం చేశారని, ఉద్దేశపూర్వకంగానే ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులను నేటి వరకు గుర్తించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఏడాది కూడా మోటార్లను ధ్వంసం చేశారని అన్నారు. పోలీస్ అధికారులు వెంటనే నిందితులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో మరల ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు కందుల పాపారావు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుంగ రాములు, షేక్ జాన్ బాషా, గౌడ సంఘ అధ్యక్షులు కందుల సత్యం, మరీదు ప్రసాద్, మరీదు వెంకటేశ్వర్లు, మరీదు రాము, మరీదు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.