Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏకలవ్య పాఠశాల తరగతులు చర్లలోనే జరపాలి
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-చర్ల
మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ప్రభుత్వ అధికారులు కేటాయించిన బృహత్తర పల్లె ప్రకృతి స్థలాన్ని ఏకలవ్య పాఠశాలకు కేటాయించి, నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి, ఆయన మాట్లాడారు. ఏకలవ్య పాఠశాల నిర్మాణం కోసం పార్టీ పోరాటం చేసే విధంగా చర్యలు చేపట్టాలని, మండల కమిటీలో తీర్మానం చేసినట్టు ఆయన పాత్రికేయులకు తెలిపారు. మండలానికి పల్లె ప్రకృతి కన్నా ఏకలవ్య పాఠశాల అత్యంత ముఖ్యమన్నారు. మండల కేంద్రంలో అనేక ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా ఉన్నప్పడికీ ఏకలవ్య పాఠశాలను భద్రాచలంలో నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. చర్లలో ఉన్న భవనాలను ఉపయోగించుకొని ఏకలవ్య పాఠశాల తరగతులను చర్లలోనే నిర్వహించాలని మచ్చా డిమాండ్ చేశారు. చర్లలో ఇప్పటికే నిర్మించి ఉన్న పోస్ట్ మెట్రిక్ బాలుర, బాలికల వసతి గృహాలలో లేదా ఖాళీగా ఉన్న కేజీబీవీలో కాని ఏకలవ్య పాఠశాల తరగతులు కొనసాగించాలని ఆయన సూచించారు. ఏకలవ్య పాఠశాలకు ఇప్పటి వరకు స్ధల కేటాయింపు జరగకపోవడానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే కారణమని సీపీఐ(ఎం) విమర్శించింది. టీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్సీ, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు వుండి బృహత్తర పల్లె ప్రకృతి స్థలం కేటాయింపు చేశారు, కానీ ఏకలవ్య పాఠశాలకు స్థలం కేటాయింపు చేయించలేక పోయారని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి మండిపడ్డారు. సొంత భవన నిర్మాణం చేపట్టి త్వరితగతిన ఏకలవ్య పాఠశాలను పూర్తిచేయాలని ఆయన సూచించారు. పార్టీ సమస్యలపై స్పందించి మండల కేంద్రంలో సీహెచ్సీని ఏర్పాటు చేయించడం, పోడు భూముల సమస్య, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలపై పోరాడాలని మండల కమిటీ తీర్మానం చేసింది. గొల్ల వినోద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల కార్యదర్శి కొండ చరణ్, నాయకులు మచ్చా రామారావు, నాగమణి, సమ్మక్క, శ్యామల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.