Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ప్రజా ప్రతినిధిలు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అలజడులు, ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్యాంపులకు వెళ్లిన ప్రజా ప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్స్ క్యాంపుకు గోవా వెళ్లారు. గోవా నుండి గురువారం హైద్రాబాద్ చేరుకున్న వీరంతా ప్రత్యేక బస్సుల్లో ఉదయం 11గంటలకు నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేరుగా కొత్తగూడెం వచ్చిన వారిలో జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య, వైస్ చైర్మెన్ కంచర్ల చంద్ర శేఖర్‌రావు, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ మరికొందరు ప్రజాప్రతినిధులు వచ్చారు. పోలింగ్ కేంద్రాన్ని ఖమ్మంపార్లమెంట్ సభ్యులు నమానాగేశ్వరరావు, ఎమ్మెల్సీ అభ్యర్ధి తాతా మధు, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియలు సందర్శించారు. ఓటింగ్ సరిళి అడిగి తెలుసుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకోని గూడెం ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. కొత్తగూడెం మున్సిపల్‌కి ఎక్స్ అఫీషీయో మెంబ ర్అయిన వనమా ఓటు హక్కు వేయలేక పోయారు. ఇటీవల ఆయన వెన్నుపూస నొప్పితో హైద్రాబాద్ ఆసుపత్రిలో చేరారు. తాజా గా వెన్నుపూస ఆపరేషన్ అయింది. కారణంగా ఆయన ఆసుపత్రిలో ఉండిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారని తెలుస్తుంది.
కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసనమండలి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాసనమండలి ఎన్నికలు నిర్వహణకు రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, భద్రాచలంలో 84 మంది, కొత్తగూడెంలో 221 మంది మొత్తం 305 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలోనికి సెల్ఫోన్లు, కెమేరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పేపర్లు, నీళ్ల సీసాలు, హ్యాండ్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు అనుమతి లేనందున నిశిత పరిశీలన చేసి పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించాలని సెక్టోరియల్ అధికారిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు దూరం వరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిభిరాన్ని, కరోనా పరీక్షలు నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి ఓటరును ధర్మల్ స్కానర్ ద్వారా పరిశీలించాలని, ఏదేని లక్షణాలున్న ఓటర్లుకు తక్షణం వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు నిర్వహణకు అంబులెన్సును, అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరణతో పాటు వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పరిశీలన చేయనున్నట్లు చెప్పారు. ఓటర్లును గుర్తించడానికి మున్సిపల్ కమిషనర్లుకు, యంపిడిఓలకు విధులు కేటాయించినట్లు చెప్పారు.
కొత్తగూడెం 94.57 శాతం ఓటింగ్
కొత్తగూడెం డివిజన్ పరిధిలోని 14 మండలాల్లోని ప్రజా ప్రతినిధులు మొత్తం ఓటర్లు 221 ఉన్నారు. వీరిలో పురుషులు 86, మహిళలు 135 మొత్తం 221కాగా, 81 మంది పురుష ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళ ప్రజాప్రతినిధుల్లో 135కిగాను 128 మంది మాత్రం ఓటు వేశారు. మొత్తంగా 209 మంది మాత్రమే ఓటు వేశారు. 12 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలుస్తుంది. మొత్తంగా 94.57ఓటింగ్ శాతం నమోదు అయింది. భద్రాచలం సబ్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పోలీంగ్ కేంద్రంలో 84 ఓటర్లుకు గాను79 మంది ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 94.05 శాతం నమోదు అయింది.
భద్రాచలం : భద్రాచలంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. శుక్రవారం భద్రాచల పోలింగ్ కేంద్రంలో 94.5 శాతం పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 84 మంది ఓట్లు గాను 79 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో తొమ్మిది మంది జడ్పీటీసీ సభ్యులు, 75 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 71 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నలుగురు ఎంపీటీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అదేవిధంగా ఒక ఎంపీటీసీ సభ్యుడు ట్రయల్ ఖైదీగా ఉండటంతో ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్, సీపీఐ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 23 మంది వచ్చారు. అలాగే సీపీఐ(ఎం), కాంగ్రెస్‌కు చెందిన ఇరువురు ఎంపీటీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పినపాక నియోజకవర్గానికి చెందిన 33 మంది ఓటర్లు ఒకేసారి భద్రాద్రి పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మణుగూరు ఇప్పల సింగారం ఎంపీటీసీ సభ్యులు పాయం ప్రమీల ఒక్కరే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఏడాదిన్నర పాపతో వచ్చి వాజేడు ఎంపీపీ శ్యామల శారద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కరకగూడెం మండలం కొత్తగూడెం ఎంపీటీసీ ఎల్ల బోయిన మునీంద్ర కూడా ఆరు నెలల చంటి పాపతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పినపాక మండలం సింగ రెడ్డి పల్లి ఎంపీటీసీ కె.వి.సుబ్బారెడ్డి వయోభారం రీత్యా సహాయకునితో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.