Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-ఎర్రుపాలెం
రైతులను మోసం చేసే పద్ధతిలో నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీపైన డీలర్పైన ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, పేపర్ ప్రకటనతో ప్రచారం హౌరెత్తించారు తప్ప నష్టపోయిన రైతుకు న్యాయం జరిగేలాగా నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీ పైన డీలర్ పైన చర్యలు లేవని సిపిఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య అన్నారు. వెంకటాపురం గ్రామానికి చెందిన వేముల వెంకటేశ్వరరావు అనే రైతు నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని అప్పు చేసి ఐదు లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టి మిరప తోట సాగు చేశాడని, రైతు వేసిన మిరప తోట నకిలీ విత్తనాలు కావడంతో తోట ఏపుగా పెరిగి పూత, కాపు, రాకపోవడంతో అట్టి మిరప తోట ను సిపిఎం బృందం ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రైతు సిపిఎం బృందంతో తన గోడును వెళ్లబోసుకున్నారు. వత్సవాయి గ్రామంలో గల దుగ్గి హనుమంతరావు అనే విత్తనాల డీలర్ వద్ద అన్నదాత సీడ్స్ 39 ప్యాకెట్లను కొనుగోలు చేసి నారు పోసి మొక్క నాటానని, కానీ తోట ఏపుగా పెరిగి కాపు రాలేదని, తనకు న్యాయం జరిగేలా చూడాలని, అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదని సిపిఎం బృందం వద్ద రైతు లబోదిబోమని మొత్తుకున్నాడు. ప్రభుత్వం, అధికారులు, స్పందించి రైతుకు న్యాయం జరిగేలాగా చూడాలని, లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండలాధ్యక్షుడు గామాసు జోగయ్య, గిరిజన సంఘం అధ్యక్షుడు ఆంగోతు వెంకటేశ్వర్లు, వృత్తి సంఘం మండలాధ్యక్షుడు నాగుల వంచ వెంకట్రామయ్య, కోటి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.