Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
బోనకల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. బోనకల్ సర్పంచ్ బుక్యా సైదా నాయక్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట కేంద్రానికి చెందిన శ్రీలక్ష్మి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరం విజయవంతమైందని కంటి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ సైదా నాయక్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో కంటి సమస్యతో బాధపడే వారిని సుమారు 100 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరికి నేత్రాలు అత్యంత ముఖ్యమైనవని, ప్రతీ ఒక్కరు నేత్రాలను రక్షించుకునేందుకు నేత్ర వైద్యులు చెప్పిన విధంగా నడుచుకోవాలని సూచించారు. శ్రీ లక్ష్మీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరం వల్ల చాలా మందికి ఉపయోగం జరిగిందన్నారు. వైద్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ హాస్పటల్లో కంటిలో శుక్లం ఆపరేషన్ చేయబడునని, ఆపరేషన్‌కు సంబంధించిన రక్తపరీక్షలు సర్జికల్ ప్రొఫైల్ ద్వారా చేయబడునని తెలిపారు. ప్రతి మంగళవారం, గురువారం మాత్రమే ఆపరేషన్లు చేయబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు శ్రీనివాసరావు, హసీనా సిబ్బంది రామచందర్, పంచాయతీ సిబ్బంది మంద నాగరాజు, షేక్ దస్తగిరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.