Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకై ఉద్యమించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణు పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు నేలకొండపల్లి మండల జనరల్ బాడీ సమావేశం మండల కేంద్రంలో సంఘం నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసేందుకు బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. అందులో భాగంగా అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల భవిష్యత్తును నిర్వీర్యం చేసిందన్నారు. కార్మికుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలుగా కొత్త చట్టంలో మార్పులు చేశారన్నారు. దీనివల్ల రానున్న కాలంలో కార్మికులపై తీవ్ర పనిభారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దుకై, కార్మిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ రానున్న ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరిగే జాతీయస్థాయి సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు నేలకొండపల్లి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా పగిడికత్తుల నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా మరో 16 మందిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు పి రమ్య, కే కోటేశ్వరి, ఏటుకూరి రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కేవీ రామిరెడ్డి, సిఐటియు నాయకులు చెరుకు శ్రీను, సిహెచ్ నాగయ్య, ఉమాదేవి, గుత్తికొండ రాణి, గాదె వెంకటేశ్వర్లు నాగేల్లి తిరుపతిరావు, వెంకటలక్ష్మి బండి రామ్మూర్తి, బొడ్డు ఆంజనేయులు, ముక్కరాల నరసింహారావు, ఎస్కే లాల్ పాష, పల్లపు శ్రీను, అంకమ్మ, వెంకన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.