Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఉపాధ్యాయుల సీనియారిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెం 317 ఆధారంగా చేపట్టిన బదిలీల్లో ఏజెన్సీ, మైదాన ప్రాంతం అనే అంశాలపై స్పష్టత లేక పోవడం వల్ల గిరిజన ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయబాబు అన్నారు. సోమవారం జిఓ నెం ఎంఎస్ 317 సవరణ చేయాలని కోరుతూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో మహదేవపురం ఎంపీపీ పాఠశాలతో పాటు కొత్తపల్లి బాలుర వసతి గృహంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల నియామకం పేరుతో జిల్లాను యూనిట్ గా తీసుకుని సీనియార్టీ లిస్టు తయారు చేయడాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. జిఓ నెం 317లో లోపాలు సవరించి ఏజన్సీ, మైదాన ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయుల సీనియార్టి లిస్టు తయారు చేయాలన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాను యూనిట్ గా తీసుకోవడం వలన గిరిజన ఉపాధ్యాయులకు తీవ్ర నష్ట జరుగుతుందన్నారు. ప్రభుత్వం కావాలని ఏజన్సీ ఉద్యోగుల పట్ల కక్ష పూరిత ధోరణి అవలంభిస్తుందన్నారు. నిరసన కార్యక్రమంలో కొత్తపల్లి ప్రధానోపాధ్యాయుడు మడకం మోతీర్, కారం సర్వేశ్వరావు, సత్యనారాయణ, కొమరం నాగయ్య, హనుమంతరావు, బొర్రయ్య, కలం సత్యనారాయణ, వాసం ఆదినారాయణ, సంగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.