Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం ఫిమాకేం పరిశ్రమలో ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఆవుల మోహనరెడ్డి కుటుంబానికి టీఎన్టీయూసీ, కంపెనీ యాజమాన్యం రూ.12 లక్షల నష్టపరిహారంతో పాటు మృతుని కుమారుడికి శాశ్వత కార్మిక ఉద్యోగం ప్రకటించారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు పరిశ్రమకు వచ్చి కార్మికుని కుటుంబాన్ని పరామర్శించి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, టీఎనీయూసీ అధ్యక్షులు కనకమేడల హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి గాదె రామకోటిరెడ్డి, కేవీఆర్. లక్ష్మీపురం సర్పంచ్ నాగమణి, ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కామిరెడ్డి రామకొండారెడ్డి, బాదం రమేష్ రెడ్డి, ఫిమాకేం యాజమాన్యం పాల్గొన్నారు.
ఆవుల భౌతికకాయానికి నివాళులర్పించిన విప్ రేగా
చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఆవుల మోహనరెడ్డి(45) లక్ష్మీపురంలో నివాసం ఉంటూ ఫిమాకేం కంపెనీలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తూ మృతి చెందిన మోహనరెడ్డి కుటుంబానికి కంపెనీ యాజమాన్యం నష్టపరిహారంగా రూ.12 లక్షలు, మృతుని కుమారునికి ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు మృత దేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు వేర్వేరుగా నివాసానికి వెళ్లి మోహనరెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, లక్ష్మీ పురం గ్రామ సర్పంచ్ సోంపాక నాగమణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, స్థానిక నాయకులు, కార్మికులు ఉన్నారు.