Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం నియోజకవర్గంలో ఎక్రజండాను నిలబెట్టిన గొప్ప మహానాయకులు కామ్రేడ్ బండారు చంద్రారావు అని, ప్రజా పోరాటాలు సాగించడమే అమరజీవి కామ్రేడ్ చంద్ర రావుకు మనం అందించే ఘన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్‌లు అన్నారు. కామ్రేడ్ బండారు చందర్రావు 36వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆవిష్కరించారు. కామ్రేడ్ చంద్రరావు చిత్రపటానికి అన్నవరపు కనకయ్య, మచ్చ వెంకటేశ్వర్లు, ఏజె.రమేష్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి మన్యం అభివృద్ధిలో, ఆదివాసీ గిరిజనులకు అండగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి మార్క్సిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణంలో కామ్రేడ్ బండారు చందర్రావు అత్యంత క్రియాశీలక పాత్ర నిర్వహించారని అన్నారు.
ఎర్రజెండాను వీడమని అనేకమార్లు బెదిరించినా, అనేక కష్టాలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా భద్రాచలం నియోజకవర్గంలో ఎర్రజెండాను నిలబెట్టిన మహానాయకుడు చంద్రరావు అని అన్నారు. నేడు కేంద్రంలో బీజేపీ కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతోందని, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే కామ్రేడ్ బండారు చందర్రావుకు మనమిచ్చే నివాళి అని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై పని చేయడం ద్వారా పార్టీని అభివృద్ధి చేయటం, మార్క్సిస్టు పార్టీని ముందుకు తీసుకు పోవటమే ఆయనకు ఇచ్చే నివాళి అని అన్నారు. కరోనా రెండవ దశలో బండారు చందర్రావు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉచిత ఐసోలేషన్ సెంటర్ నిర్వహించడం అభినందనీ యమని అన్నారు. రానున్న కాలంలో బండారు చందర్రావు ట్రస్ట్ సేవలు విస్తృత పరిచి అనేక పద్ధతుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి, ఎం.వి.అప్పారావు, యస్.కోటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు బిబిజీ తిలక్, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నమ గంగా, పట్టణ కమిటీ సభ్యులు నాగరాజు, బి.కుసుమ, ఎస్.డి.ఫిరోజ్, కుంజా శ్రీనివాస్, చేగోండి శ్రీనివాస్, జ్యోతి, జి.లక్ష్మణ్ జీవనజ్యోతి, కోరాడ శ్రీనివాస్, కుటుంబ సభ్యులు నవోదయ, బండారు సరస్వతి తదితరులు పాల్గొన్నారు.