Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్‌దేనని ఆ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 96 ఓట్ల బలం మాత్రమే ఉండగా 242 ఓట్లు లభించడం గమనార్హమన్నారు. ఈ ఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ప్రభుత్వ పాలనతీరును వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంనగరంలోని సంజీవరెడ్డి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఫలితాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాయల ప్రజాసేవ కార్యక్రమాలే ఆయనకు ఈ స్థాయిలో ఓట్లు లభించేలా చేశాయన్నారు. అధికారపార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్లనే ఈ గెలుపొందిందన్నారు. గోవా క్యాంపులు, బహుమతులు, రూ.లక్షల నజరానాలు, ప్రలోభాలు, భయం, ఒత్తిడి ఇలా ఓటర్లను ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలో అన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేశారని అన్నారు. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పదికి పదిస్థానాల్లో క్లీన్‌స్వీప్ చేస్తుందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజా, రైతువ్యతిరేక విధానాలను ప్రజలు గుణపాఠం చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమైతే ఈ ఫలితం మరోలా ఉండేదన్నారు. కమ్యూనిస్టులు తమకు ఎప్పుడూ మిత్రపక్షాలేనని తెలిపారు. ఆ పార్టీలతో కలిసి అనేక పోరాటాలు నిర్వహించామన్నారు. రాయలకు ఓట్లేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఓట్లేసిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు జరిగివుంటే తమదే గెలుపన్నారు. తమకున్న బలం కంటే అదనంగా 146 ఓట్లు రావడం తమ నైతిక విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ ఖమ్మం నగర అధ్యక్షులు జావీద్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముక్కా శేఖర్, జిల్లా కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవీరెడ్డి, నాయకులు బాలగంగాదర్ తిలక్, రఫీదాబేగం తదితరులు పాల్గొన్నారు.