Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విధాన మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చర్చనీయాశంగా మారింది. టీఆర్ఎస్, దానికి అంతర్గతంగా మద్దతు ఇచ్చిన సీపీఐ, తదితర పార్టీల నుంచి భారీ మొత్తంలో ఓట్లు కాంగ్రెస్‌కు క్రాస్ అవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. దాదాపు గెలిచిన సంతోషం కూడా 'కారు'పార్టీకి లేకుండా పోయింది. కాంగ్రెస్ తన బలం కన్నా 146 ఓట్లు అదనంగా సాధించింది. ఈ ఓట్లలో సుమారు వందకు పైగా టీఆర్ఎస్, దాని మిత్రపక్షం నుంచి 'హస్త'గతం చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విషయమై టీఆర్ఎస్ నేతలు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. అధినేత కేసీఆర్ దగ్గర ఎవరిపై నింద మోపాలో అర్థంకాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న సీనియర్ నేతలపై నింద మోపాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఎమ్మెల్యేల మాటతీరును బట్టి అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరికి వారు రాజకీయ వ్యూహంతో వ్యవహరించారు. ఓ అంచనా ప్రకారం ఖమ్మం, కొత్తగూడెం పోలింగ్ కేంద్రాల ఓట్లే అత్యధికం క్రాస్ అయినట్లు చెబుతున్నారు.
- అంచనాలు ఇలా...
క్రాస్ ఓటింగ్ అంచనాలను పరిశీలిస్తే మొత్తం 768 ఓట్లను నాలుగు పోలింగ్ కేంద్రాలుగా విభజించారు. అన్నింటిలో కలిపి 738 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు. పోగా 726 ఓట్లు చెల్లినవి. మొత్తం ఈ ఎన్నికల్లో 768 ఓట్లకు గాను 738 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీని ఆధారంగా కోటా ఓట్లను 364గా నిర్ధారించారు. వాల్యుడ్ అయిన 726 ఓట్లలో తాతా మధుకు 480 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 242 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావుకు 4 ఓట్లు లభించగా మరో స్వతంత్ర అభ్యర్థి కొండ్రు సుధారాణికి ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీల బలాబలాలను పరిశీలిస్తే టీఆర్ఎస్ 498 స్థానాల్లో గెలుపొందగా వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల చేరికతో ఆ పార్టీ బలం 550 వరకు చేరింది. దానికి మద్దతు ఇస్తున్న సీపీఐ 34 ఓట్లు కలిగి ఉంది. ఈ లెక్కన టీఆర్ఎస్ బలం 584. కాంగ్రెస్ 116 స్థానిక సంస్థలను గెలుచుకోగా ఆ పార్టీ నుంచి 20 మంది టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 96కు తగ్గింది. 15 ఓట్లున్న టీడీపీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. తద్వారా ఆ పార్టీ బలం 111. తటస్థంగా ఉన్న సీపీఐ(ఎం) 26, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ 15 మందిలో మొత్తం 10 మంది వరకు ఓట్లు వేసినట్లు సమాచారం.వీరి ఓట్లు కూడా కాంగ్రెస్‌కే అధికం పడివుంటాయని భావిస్తున్నారు. 54 మంది స్వతంత్రుల ఓట్లలోనూ అధికం 'హస్త'గతం అయినట్లు చెబుతున్నారు. ఎక్స్అఫిషియో ఓటర్లు 9 (ఎమ్మెల్యేలు+ ఎంపీ+ ఎమ్మెల్సీ) మంది టీఆర్ఎస్కు చెందినవారే ఉన్నారు. ఇలా ఏ లెక్కన చూసినా కాంగ్రెస్ అసలు బలం కన్నా అదనంగా 146 ఓట్లు సాధించడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఈ ఓట్లే నిదర్శనమని చెబుతున్నారు.
- గెలిచినా 'గులాబీ'లో గుబులు
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినప్పటికీ నైతిక విజయం మాత్రం కాంగ్రెస్‌దేనని విశ్లేషకులు అంటున్నారు. 96 మంది ఓటర్లున్న ఆ పార్టీ ఏకంగా 242 ఓట్లు సాధించడం చర్చనీయాంశమైంది. ఈ ఫలితం టీఆర్ఎస్ నేతలకు గుబులు పుట్టిస్తోంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఆ పార్టీ ఆలోచనలో పడేలా ఈ ఎన్నికల ఫలితాలున్నాయనే చర్చ సాగుతోంది. కొత్తగూడెం, ఖమ్మం పోలింగ్స్టేషన్ల పరిధిలో అత్యధిక ఓట్లు క్రాస్ అయినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అశ్వారావుపేట, కొత్తగూడెం, వైరా, ఇల్లెందు, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు అత్యధికంగా క్రాసింగ్‌కు పాల్పడినట్లు టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ క్రాసింగ్ తాలూకు నిందను ఎవరు భరించాలనే విషయంపై చర్చ ఊపందుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న నేతలపై నెపాన్ని నెట్టాలనే యోచనలో ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి పలువురు భావిస్తున్నారు.