Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు జోరు చూపింది. ఆ పార్టీ అభ్యర్థి తాతా మధుసూదన్‌రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుపై 238 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వాస్తవ మెజార్టీ దృష్ట్యా ఆయన 116 ఓట్లతో విజయం సాధించినట్లు. ఈనెల 10వ తేదీన పోలింగ్ నిర్వహించారు. ఫలితాలను మంగళవారం వెల్లడించారు. మొత్తం ఈ ఎన్నికల్లో 768 ఓట్లకు గాను 738 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీని ఆధారంగా కోటా ఓట్లను 364గా నిర్ధారించారు. వాల్యుడ్ అయిన 726 ఓట్లలో తాతా మధుకు 480 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 242 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావుకు 4 ఓట్లు లభించగా మరో స్వతంత్ర అభ్యర్థి కొండ్రు సుధారాణికి ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం. ఆమె కూతురు ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి టీఆర్ఎస్ తరఫున ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆమె సైతం తల్లికి ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
- గంటన్నరలోనే ముగిసిన కౌంటింగ్...
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేవలం గంటన్నర వ్యవధిలోనే ముగిసింది. 768 ఓట్లను నాలుగు భాగాలుగా విభజించారు. ఒక్కో టేబుల్‌పై 200 ఓట్ల చొప్పున మూడు బల్లలపై 600 ఓట్లను, నాలుగో టేబుల్‌పై 138 ఓట్లను లెక్కించారు. నాలుగు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు భద్రాచలం, కొత్తగూడెం, కల్లూరు, ఖమ్మంలలో పోలింగ్ ముగిసిన తర్వాత తీసుకువచ్చిన బ్యాలెట్ బాక్స్‌లను స్థానిక డీపీఆర్సీ భవన్లో భద్రపరిచారు. మంగళవారం ఉదయం 7.30 గంటల తర్వాత వాటిని బయటకు తీశారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. కట్టకు 25 బ్యాలెట్ పేపర్ల చొప్పున ఉంచి లెక్కింపు మొదలుపెట్టారు. సరిగ్గా గంటన్నర వ్యవధిలో లెక్కింపు పూర్తవడంతో ఫలితాన్ని ప్రకటించారు. విజేత తాత మధుసూదన్‌కు జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
- చర్చనీయాంశమైన క్రాస్ ఓటింగ్...
వాస్తవానికి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 550 ఓట్లు ఉండగా అందులో కేవలం 480 ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పోల్ అవడం చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 470 స్థానాలను కైవసం చేసుకోగా ఇతర పార్టీల నుంచి 80 మంది వరకు టీఆర్ఎస్లో చేరారు. ఇలా ఆ పార్టీ బలం 550కి చేరింది. కానీ దానిలో సుమారు 150 ఓట్లకు పైగా కాంగ్రెస్‌కు క్రాస్ అవడం చర్చకు దారితీస్తోంది. దీనిపై ఇప్పటికే పోస్టుమార్టం మొదలైనట్టు తెలుస్తోంది.
- మధుకు పలువురి అభినందనలు...
ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తాతా మధును పలువురు అభినందించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, ఎన్నికల పరిశీలకులు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, బాణోత్ హరిప్రియ, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు. మధు గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చుతూ...టపాసులు పేల్చుతూ...సంబురాలు చేశారు.
- తాతా మధు గురించి సంక్షిప్తంగా...
తాతా మధుసూదన్ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో తాతా వెంకటకృష్ణయ్య, కమలమ్మ దంపతులకు జన్మించారు. బాల్యం నుంచి వామపక్ష భావజాలం ఉన్న ఆయన విద్యార్థి దశలో సీపీఐ(ఎం) అనుబంధ ఎస్ఎఫ్ఐలో చురుకుగా పనిచేశారు. 1986-96 మధ్య కాలంలో సీపీఐ(ఎం) పూర్తికాల కార్యకర్తగా ఉన్నారు. 1998 నుంచి 2014 మధ్యకాలంలో అమెరికాలో తానా కార్యదర్శిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్లో చేరారు. 2017 నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో డిగ్రీ, పీజీ, లా పూర్తి చేసిన మధుకు భవానితో వివాహం జరిగింది. వారికి భార్గవ్, కృష్ణస్వరూప్ అనే పిల్లలు ఉన్నారు. 2014 నుంచి 2021 వరకు ఆయన పార్టీ అప్పగించిన విధులు నిర్వహిస్తూ వస్తుండటంతోనే కేసీఆర్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చినట్లు టీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుని నమ్మకం వమ్ము కాకుండా గెలిచిన మధు ఫలితాల అనంతరం సీఎం ఆశీస్సుల కోసం ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలతో కలిసి హైదరాబాద్ వెళ్లారు.