Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐసిడిఎస్ పిడికి వినతి
నవతెలంగాణ- ఖమ్మం
అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలని, పెంచిన పిఆర్సి వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈనెల 20 తేదీన జరిగే ఖమ్మం కలెక్టరేట్ ధర్నాజయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో పీడీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఐసిడిఎస్ బాధ్యత నుండి రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకోవాలని చూస్తున్నదని, ఇందులో భాగంగానే పద్నాలుగు వేల అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలోకి తరలించాలని నవంబర్ 9న జరిగిన సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వైద్య శాఖ అధికారులు నిర్ణయం చేశారని, ఈ నిర్ణయం సరైంది కాదన్నారు. అంగన్వాడీ ఉద్యోగులతో పాటు పేద ప్రజలకు నష్టం కలిగించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ యధావిధిగా కొనసాగించాలని పెంచిన పిఆర్సి కేంద్రం పెంచిన వేతనాలు పెన్షన్ సౌకర్యం, పెండింగ్ టీఎ డిఎలు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్, అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కే రాధా సుధా, పి.రమ్య, నాయకులు ఉమా పాల్గొన్నారు.