Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగుల విభజన ప్రక్రియ జిల్లా ప్రత్యేక అధికారి డా.శరత్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఉద్యోగుల విభజన ప్రక్రియను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఉద్యోగుల విభజన ప్రక్రియ జిల్లా ప్రత్యేక అధికారి డా. శరత్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయి క్యాడర్ పోస్టుల విభజన ప్రక్రియపై ఆయన సమీక్షించారు. జిల్లాలో ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగవంతంగా ఉందన్నారు. 1975 తరువాత రాష్ట్రపతి జోనల్ వ్యవస్థ - 2018 ఆమోదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ నియమనిబంధనలను పూర్తిగా అనుసరిస్తూ సంబంధిత జిల్లా అధికారులు నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకంగా విభజన ప్రక్రియను చేపట్టాలన్నారు. సీనియారిటీ, ఉద్యోగుల ఆప్షన్లను పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ సమర్పించాలని జిల్లా అధికారులకు సూచించారు. జిల్లా అధికారులు సిద్ధం చేసిన సీనియారిటీ జాబితాను సంబంధిత ఉద్యోగ సంఘాల బాధ్యులకు అందించి రశీదు పొందాలన్నారు. ఉద్యోగులు సమర్పించిన ఆప్షన్ దరఖాస్తులను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగులు నాలుగు ప్రాంతాలను తప్పనిసరిగా ఆప్షన్లో పొందుపర్చాలని డా.శరత్ తెలిపారు. స్పెషల్ కేటగిరి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల విభజనలో ప్రభుత్వ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతంగా చేస్తామన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశామని తెలిపారు. వివిధ జిల్లా అధికారుల ద్వారా సమర్పించబడిన నివేదికలను పరిశీలించేందుకు సీనియర్ అధికారులతో కూడిన ఏడు బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే సీనియారిటీ జాబితా పరిశీలించామని, ఉద్యోగుల నుండి ఆప్షన్ ఫారములు కూడా సేకరించామని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపు కొసం షెడ్యూల్ కూడా సిద్ధం చేశామన్నారు. పోలీసు కమిషనర్ విష్ణు. యస్.వారియర్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు తమ శాఖల ఉద్యోగుల విభజన ప్రక్రియకు చేపట్టిన చర్యలను వివరించారు. అదనపు డి.సి.పి గౌస్ ఆలం, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి. అప్పారావు, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, జిల్లా విద్యా శాఖాధికారి యస్. యాదయ్య, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.