Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 నెలలుగా పరిహారం రాక ఇక్కట్లు
- రూ.35 లక్షలకు అవార్డు పెంచాలని డిమాండ్
- అస్సలు పరిహారం వస్తుందో రాదోనని ఆందోళన
- పర్సంటేజీ ఆరోపణలను ఖండించిన అధికారులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సీతారామ ఎత్తిపోతల పథకం పరిహారం కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పనులన్నీ వదిలేసుకుని ఖమ్మంలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ), జిల్లా నీటిపారుదలశాఖ కార్యాలయం, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదిగో ...అదుగో అంటూ ఏడాదిన్నరగా కాలయాపన చేస్తున్నారే తప్ప ఇప్పటి వరకు 2000 మంది రైతుల్లో కేవలం 245 మందికి రూ.47 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని దాదాపు 1700 మంది రైతులకు సుమారు రూ.200 కోట్లకు పైగా పరిహారం చెల్లించాల్సి ఉంది. తాజాగా బీరోలు రెవెన్యూ పరిధిలో 16 మందికి, కామేపల్లి మండలం నెమలిపురిలో 11 మందికి పరిహారం చెల్లించారు. ఈ పరిహారం చెల్లింపులోనూ నియమనిబంధనలకు విరుద్ధంగా పర్సంటేజీలకు కక్కుర్తిపడి అధికారులు పైరవీలకు పెద్దపీట వేస్తున్నారని భూ నిర్వాసితుల అభియోగం.
- పరిహారం కోసం పైరవీ...!
పెరిగిన భూవిలువకు అనుగుణంగా పరిహారం పెంచాలని ఓవైపు, పైరవీలకు తావులేకుండా వెంటనే పరిహారం విడుదల చేయాలని మరోవైపు రైతులు పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం కల్వర్టులు, ఆక్విడెక్టులు, అండర్టన్నెల్స్ ఇతరత్ర అత్యవసర పనులు నిర్వహించాల్సిన ప్రాంతాల్లోని రైతులకు తక్షణం పరిహారం చెల్లించి పనులు మొదలుపెట్టాలి. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా కొన్నిచోట్ల చెల్లింపులు జరుగుతుండటం నిర్వాసిత రైతుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. వైషమ్యాలు తలెత్తుతున్నాయి. తెట్టెలపాడు, తిప్పారెడ్డిగూడెం, డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్టు అత్యవసర నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఆయా ప్రాంత నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో ఔచిత్యం ఉంది. పర్సంటేజీలు, పైరవీలకు తలగ్గి ఇటీవల కొందరు నిర్వాసితులకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయడంతో రైతుల్లో వైషమ్యాలు తలెత్తుతున్నాయి. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే ఆర్థికశాఖ మంత్రి, ఆర్థికశాఖ కార్యదర్శి పేషీ నుంచే ఈ వ్యవహారం నడిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ సంబంధిత నిర్వాసితులు తామెవ్వరీకి ఒక్కపైసా ఇవ్వలేదని చెబుతున్నా మిగిలిన రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు. వందకు 2% చొప్పున పర్సంటేజీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అందుకే ఒక లెక్కాపత్రం లేకుండా అరకిలోమీటర్ దూరంలో కొందరికి, కిలోమీటర్నర దూరంలో కొందరికి పరిహారం ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఏడాదిలో ప్రాజెక్టు పూర్తిచేసి నీరిస్తామన్న సీఎం ఆరేళ్లయినా పరిహారం ఇవ్వకపోవడంతో రైతుల్లోనూ భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోతాదుకు మించి జలవనరులు అందుబాటులో ఉన్న ఈ సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం ఏ మేరకు దృష్టి సారిస్తుందనే అనుమానాలున్నాయి. అలాగే నిధుల లేమి వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సకాలంలో పరిహారం అందడం అనుమానమేననే అభిప్రాయాన్ని సైతం నిర్వాసితులు వెలిబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆందోళ నలకు పూనుకున్నారు. పరిహారం వస్తుందనే నమ్మ కంతో అప్పులు చేసి బయట ఆస్తులు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ మేరకు పరిహారం పెంపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
- పరిహారం పెంచాలి..సకాలంలో చెల్లించాలి...
కొప్పుల రామిరెడ్డి, బీరోలు నిర్వాసితుడు
సీతారామ ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం ఎకరానికి రూ.18.50 లక్షల నుంచి రూ.35లక్షలకు పెంచాలి. గతంలో సత్తుపల్లి ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం ఎకరం రూ.16 లక్షల చొప్పున భూమి సేకరించారు. దాన్ని ఇప్పుడు రూ.25 లక్షలకు పెంచారు. ఈ లెక్కన మాకూ పరిహారం పెంచితే రూ.29లక్షల వరకు వస్తుంది. దీనిపై ఇరిగేషన్ డీఈని ప్రశ్నించడంతో ఆయన కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. వడ్డీతోని పరిహారం చెల్లిస్తాం..అని కలెక్టర్ అన్నారు. మరోమాట ఇంకా మేము మీ దగ్గర భూములు తీసుకోలేదన్నారు. ఏ శాఖ అధికారులో తెలియదుగానీ పర్సంటేజీ తీసుకుని కొందరికి నిబంధనలకు విరుద్ధంగా పరిహారం ఇవ్వడంపై విచారణ చేయాలి.
- సత్వర పరిహారానికి కలెక్టర్ సానుకూలం
బాణాల రమేష్‌రెడ్డి, నీటిపారుదల శాఖ డీఈ
వీలైనంత త్వరగా పరిహారం ఇప్పిస్తానని కలెక్టర్ నిర్వాసితులకు తెలిపారు. పరిహారం పెంపు కుదరదు కానీ వడ్డీతో సహా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొందరికి మాత్రమే పరిహారం రావడంలో నీటిపారుదల శాఖకు ఎలాంటి సంబంధం లేదు.