Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ విద్యార్థి సంఘం జాతీయ నాయకుడు జలాల్ మహమ్మద్
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండలంలో వివిధ ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థానికంగా ఉండి, విధులు నిర్వర్తించాలని మాజీ విద్యార్థి సంఘం జాతీయ నాయకుడు జలాల్ మహమ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రములో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన మండలమని ఈ ప్రాంతానికి విధుల కోసం వచ్చి పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు విధులు సరిగా నిర్వహించకపోతే పరిపాలన అస్తవ్యస్థంగా మారిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైద్య, విద్య, రెవెన్యూ రంగాలలో పనిచేస్తున్న కింది స్థాయి నుండి పైస్థాయి అధికారుల దాకా ప్రజలకు అందుబాటులో ఉండకపోతే ప్రజలతో మమేకమై పనిచేయకపోతే ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారిపోతాయని ఆయన పేర్కొన్నారు. అసౌకర్యాలకు నిలయమైన ఏజెన్సీ మండలంలో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాల సహాయ సౌకర్యాలు అందిస్తామని, వారికి అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా విధులకు డుమ్మా కొట్టి ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.