Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ ఒప్పంద ఉద్యోగ,కార్మిక సిబ్బంది డిమాండ్
- విధుల బహిష్కరణ... ధర్నా, రోడ్డుపై వంటావార్పు
నవతెలంగాణ-ఖమ్మంకార్పొరేషన్
ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.నెం. 60ని అనుసరించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కేటగిరీల వారిగా కనీస వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్ టియు) రాష్ట్ర అధ్యక్షులు జి. రామయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్మికులు గురువారం విధులు బహిష్కరించారు. ధర్నా చౌక్ లో 48 గంటల నిర్వదిక దీక్షలు చేపట్టారు. వంటావార్పు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పే కమిషన్ అనేక మందితో చర్చించి అనేక విషయాలు పరిగణలోకి తీసుకొని తన సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. పే కమిషన్ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గ్రూప్-4లో పనిచే స్తున్న వారికి రూ.19వేలు, గ్రూప్-3లో పనిచే స్తున్న వారికి రూ. 22,900/-లు, గ్రూప్-3ఏలో పనిచేస్తున్న వారికి రూ.31వేలు సిపార్సు చేసిందని తెలిపారు. పే కమిషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జీతాలతో పాటు సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా సెలవులు ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని చెప్పిందన్నారు. పే కమిషన్ సుప్రీం కోర్టు, హైకోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఇచ్చిన తీర్పులను కూడా పరిగణలోనికి తీసుకొని తన సిఫార్సులు ఇచ్చిందన్నారు. కమిషన్ రిపోర్టులో తెలియజేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21నాడు విడుదల చేసిన జి.ఓ.నెం 60లో పే కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగా రూ.15,600/-లు,రూ. 19,500/-లు, రూ.22,750/-లుగా ప్రకటిం చటాన్ని తీవ్రంగా ఖండించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విధ విభాగాల ఉద్యోగ కార్మిక సిబ్బంది అనేక సంవత్సరాలుగా వెట్టి చాకిరీలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జీతాలు పెంచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచుతాని చెప్పి ఐదు నెలలు అవుతున్నా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీ.ఓ ప్రకారం కేటగిరీల వారీగా పారిశుద్ధ్య కార్మికులకు కనీసవేతనాలు నిర్ణయించి చెల్లించాలని కోరారు. కార్పొరేషన్,మున్సిపాలిటీలు, పురపాలక సంఘాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పనిచేస్తున్న కార్మికులకు పని భారం తగ్గించి కార్మిక సంఖ్య పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ అమలు చేస్తూ గ్రేటర్ హైదరాబాద్లో జీతాలు పెంచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ మున్సిపాలిటీలు, పురపాలక సంఘాలలో మాత్రం జీతాలు పెంచకపోడం విచారించ దగిన విషయమన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు పెంచి జూన్ నెల నుండి ఎరియర్స్ చెల్లించాలని లేదంటే జనవరి నెలలో నిర్వధికంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్, కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు, ఎఐటియుసీ రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు, ఎఐటియుసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, యస్.కె.చానా, సిఐటియు జిల్లా నాయకులు మాచర్ల గోపాల్, ఐఎఫ్టియు నాయకులు ఆవుల అశోక్, ఆడెపు రామారావు, కంకణాల శ్రీనివాస్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కె.నారాయణ, టి.రాములు, నర్సింహ, సంగమ్మ, పుష్ప, ఐయన్ టియుసిజిల్లా కార్యదర్శి శ్రీరాములు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు యం.జయరాజు, వెంకటరత్నం, లాజరు, లత, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు షేక్ హుస్సేన్, బి.పాపారావు, మహేష్, నాగమణి, సిఐటియు నాయకులు జల్లి శ్రీను, వెంకటమణ, పద్మా, సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.