Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు ఉద్యోగుల సమ్మెలకు సీఐటీయూ మద్దతు
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 16, 17న రెండు రోజుల పాటు జరిగే దేశవ్యాప్త సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ స్పష్టం చేశారు. గురువారం ప్రారంభమైన సమ్మెలో ఆయన పాల్గొన్నారు. మద్దతు తెలిపారు. సమ్మె ప్రారంభం సందర్భంగా ఎస్బిఐ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో బ్యాంకు ఉద్యోగుల ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వరంగ బ్యాంకులు జాతీయీకరణ లక్ష్యాల సాధనలో అద్భుతమైన ప్రగతి సాధించాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ పథకాల అమలుకు పట్టుగొమ్మలుగా పనిచేస్తున్నాయన్నారు. పొదుపు సంఘాలకు రుణాల ద్వారా మహిళా సాధికారికతకు కృషి చేస్తున్నాయి. అట్టడుగు వర్గాల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి చేయూతనిస్తున్నాయన్నారు. ప్రాధాన్యతా రంగాలైన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, చేతివృత్తులు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను అందిస్తున్నాయి. గృహనిర్మాణ రుణాలు, ఎడ్యుకషన్లోన్లు సామాన్యులకు అందిస్తున్నాయి. గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే వారికి జీతాల చెల్లింపు, రైతు బంధు పథకాల వంటి వాటి అమలు ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలందించేది కూడా ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు శాఖలే అని గుర్తుచేశారు. జన్‌ధన్ యోజన ఖాతాల ద్వారా బ్యాకింగ్ రంగం 43కోట్ల జన్‌ధన్ ఖాతాలు ప్రారంభిస్తే వాటిలో 97శాతం ఖాతాలు ప్రభుత్వరంగ బ్యాంకులలో ఉన్నాయన్నారు. అత్యధిక ప్రజానికాని సేవలందిస్తున్న బ్యాంకులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తే నష్టపోయేది సామాన్యులేనని తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులను రక్షించుకోవటం మనందరి బాధ్యతన్నారు. ఈ ధర్నాలో సీఐటీయూ కొత్తగూడెం పట్టణ నాయకులు డి.వీరన్న, సింగరేణి ఎంప్లాఇస్ యూనియన్ నాయకులు వై.వెంకటేశ్వర్లు, ఉపాద్యాయ సంఘ నాయకులు దస్తగిరి, ఉద్యోగ సంఘాల నాయకులు, వామపక్ష కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.