Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి చాంబరులో రైతులు బైఠాయించి నిరసన
నవతెలంగాణ-వైరా టౌన్
వైరా వ్యవసాయ మార్కెట్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమశాతం చూసే మిషన్లు ఎక్కువ తక్కువ చూపడం, తేమ పేరుతో ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండేందుకు అధికారులు నిర్లక్ష్యం చేయడంపై గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి చాంబరులో రైతులు బైఠాయించి, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ గత రెండు రోజులు క్రితం వ్యవసాయ మార్కెట్ ధాన్యం తేమశాతం చూసే మిషన్లు ఎక్కువ, తక్కువ చూపడంపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ మార్కెట్లో ఉన్న రెండు తేమశాతం చూసే మిషన్లు రెండు రకాలుగా చూపడం జరిగిందని, 15, 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసి తేమశాతం పరిశీలిస్తే రోజు రోజుకి తేమశాతం పెరగడంతో రైతులు మంగళవారం ఆందోళన చేయగా రెండవ తేమ శాతం మిషన్ బయటికి తీసి ధాన్యం తేమశాతం పరిశీలిస్తే 6 పర్సెంట్ తేడా చూపిందని, ఈ విషయాన్ని వ్యవసాయ మార్కెట్ అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు మిషన్లు మార్పు చేయకుండా తేమశాతం రాలేదని ధాన్యం కటా వేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని అన్నారు. ధాన్యం కొనుగోలు నిర్వకులు వజీర్ కల్లూరు వ్యవసాయ మార్కెట్ నుంచి తేమశాతం మిషన్లను వైరా వ్యవసాయ మార్కెటుకు తెప్పించగా, వైరా మార్కెట్ మిషన్లలకు వాటి మధ్య కూడా తేడా ఉండటంతో రైతులు మరింతగా నిరసన తెలిపారు.
వైరా వ్యవసాయ మార్కెట్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమశాతం మిషన్ల సమస్యను జిల్లా డిఎస్ఓ రాజేంద్ర, జిల్లా మార్కెట్ అధికారి నాగరాజు దృష్టికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు ఫోన్ ద్వారా వివరించారు. జిల్లా మార్కెట్ అధికారి నాగరాజు స్పందించి ఖమ్మం నుంచి నూతన తేమశాతం మిషన్లు వైరా మార్కెటుకు పంపించారు. వాటి ద్వారా తేమశాతం చూసి ధాన్యం కొనుగోలుకు అధికారులు ముందుకు రావడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, తెలుగు దేశం మండల అధ్యక్షులు చెరుకూరి చలపతిరావు, తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ అధ్యక్షులు పైడిపల్లి సాంబశివరావు, పట్టణ నాయకులు హరి వెంకటేశ్వరరావు, బెజవాడ వీరభద్రం, టిఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు తన్నీరు నాగేశ్వరరావు, రైతులు మేదరమేట్ల పూర్ణయ్య, ఏలూరి ప్రభాకర్ రావు, తాతారావు పాల్గొన్నారు.