Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు చెప్పినా ససేమిరా అంటున్న వైనం
- వ్యాక్సినేషన్‌పై మరోసారి అవగాహన కల్పిస్తాం : తహశీల్దార్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కరోనా రాకుండా వ్యాక్సిన్ కోసం ఒక పక్క ప్రజలు పరుగులు పెడుతుంటే చింతగుప్ప గ్రామ పంచా యతీలోని పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలు మాత్రం తమకు కోవిడ్ వ్యాక్సినేషన్ వద్దంటూ తిరస్కరిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 150 మంది గిరిజనులు నేటికి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని పరిస్థితి చింతగుప్ప గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. వీరంతా చింతగుప్ప గ్రామంలోని ఓ చర్చికు వెళ్లడం కొసమెరుపు. కాగా ఉన్నతాధికారులు మాత్రం 100 శాతం వ్యాక్సినేషన్ పక్రియను పూర్తి చేయాలని వైద్య సిబ్బంది, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చింత గుప్ప గ్రామ పంచాయతీలో గల చింతగుప్ప, తోగ్గూడెం, బురద మడుగు, శుగ్నాపురం గ్రామాలు ఉన్నాయి. చింతగుప్ప గ్రామంలో 328 మంది జనాభా కలిగి ఉండగా వీరిలో 95 మంది నేటికి వ్యాక్సినేష్ వేయించుకోలేదు. తోగ్గూడెం గ్రామంలో 182 మంది జనాభా ఉండగా వీరిలో 25 మంది, బురదమడుగులో 233 మంది జనాభా ఉండగా వీరిలో 30 మంది కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించు కోలేదు. నేటి వరకు 150 మంది ఒక్క కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని పరిస్థితి ఒక్క చింతగుప్ప పంచాయతీలోని ఉందని చెప్పవచ్చు. పర్ణశాల ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణిదీప్, వైద్య సిబ్బంది అనేక సార్లు గ్రామాల్లోకి వెళ్లి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించినప్పటికీ వారు కోవిడ్ వ్యాక్సినేషన్ ససేమిరా అంటున్నారు. కాగా వీరంతా చింతగుప్ప గ్రామంలో గల ఓ చర్చికు వెళ్లడంతో పాటు వైద్య సిబ్బంది వెళ్లిన సమయంలో వీరిలో కొంత మంది ఆత్మ పరిశుద్దంగా ఉండాలని వ్యాఖ్యానించడం తెలిసింది. దీంతో పాటు చర్చి ఫాస్టర్ మాత్రం తనకు కోవిడ్ వ్యాక్సిన్ వద్దని వైద్య సిబ్బందికి సూచించినట్లు తెలిసింది.
వ్యాక్సినేషన్‌పై గిరిజనులకు అవగాహన
చింతగుప్ప గ్రామ పంచాయతీలోని పలు గ్రామాలకు చెందిన గిరిజనులు కోవిడ్ వ్యాక్సినేషన్‌ను తిరస్కరిస్తున్నారని తెలుసుకున్న తహశీల్దార్ శుక్రవారం చింత గుప్ప గ్రామం వెళ్లారు. ఈ సందర్బంగా కరోనా తీవ్రత మూడో వేవ్ ఒమిక్రాన్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని వారికి సూచించారు. అయినప్పటికీ వారు ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ విషయమై నవతెలంగాణ తహశీల్దార్ వర్షా రవికుమార్‌ను వివరణ కోరగా చింతగుప్ప గ్రామంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోని వారి వద్దకు వెళ్లి అవగాహన కల్పించామని మరొక సారి గ్రామంలోకి వెళ్లి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకునే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్ఐ ఆదినారాయణ, ఎంపీఓ ముత్యాలరావు, వీఆర్ఓలు మధుబాబు, శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది ఉన్నారు.