Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెఏసీ సమిష్టి కృషితోనే సింగరేణిలో 72గంటల సమ్మె విజయవంతం
- సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నేతలు స్పష్టీకరణ
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వ అనుబంధ బీఎంఎస్ సంఘం నేతల ఒంటెద్దు పోకడలు సరికాదని, జేఏసీ నిర్ణయానికి విరుద్దంగా ఆ సంఘ నాయకులు వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్ పోరాటాలకు విఘాతం కలిగిస్తాయని సింగరేణి కార్మిక సంఘాల జేఏసి నేతలు పేర్కొన్నారు. ఏఐటియుసి జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏఐటియుసి నాయకులు దమ్మాలపాటి శేషయ్య, హెచ్ఎంఎస్ నాయకులు రమణారావు, సిఐటియు నాయకులు విజయగిరి శ్రీనివాస్, టిబిజికెఎస్ నాయకులు పోమిరెడ్డి మాట్లాడారు. కోల్ బెల్ట్ పరిధిలోని నాలుగు బొగ్గుబ్లాకులను ప్రైవేటీకరించొద్దని జేఏసి ఆధ్వర్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసి వినతిపత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించామని, ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బిఎంఎస్ నాయకులు భాగస్వామ్య సంఘాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఢిల్లీ వెళ్లి బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దని బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి కోరడం సరైంది కాదన్నారు. ఈ సంఘం నాయకులు వ్యక్తిగత ప్రాపకం కోసం ప్రాకులాడుతూ జేఏసి ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అన్ని కార్మిక సంఘాల సమిష్టి కృషితోనే ఇటీవల జరిగిన 72 గంటల సమ్మె విజయవంతమైందని, ఈ విసయం జేఏసిదేతప్ప ఏ ఒక్క కార్మిక సంఘానిది కాదని స్పష్టం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో ఏఐటియుసి నాయకులు వంగా వెంకట్, జి.వీరస్వామి, హెచ్ఎంఎస్ నాయకులు ఎండి.గౌస్ తదితరులు పాల్గొన్నారు.