Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండవ రోజూ మున్సిపల్ కార్మికుల ధర్నా
- సంఘీభావం తెలిపిన అఖిల పక్ష పార్టీలు
నవతెలంగాణ-గాంధీచౌక్
కేసీఆర్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోగినపల్లి వెంకటేశ్వర్లులు అన్నారు. కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన శుక్రవారం రెండోరోజుకు చేరింది. అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కేటగిరీల వారిగా కనీస వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ప్రకారం కార్మికులకు వేతనాలు అమలు చేసి ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర అధ్యక్షులు జి రామయ్య, సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్లు మాట్లాడుతూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ విభాగాల ఉద్యోగ కార్మిక సిబ్బంది అనేక సంవత్సరాలుగా వెట్టి చాకిరీతో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పి ఏడు నెలలు కావస్తున్నా కాలయపన చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీ.ఓ ప్రకారం కేటగిరీల వారిగా పారిశుద్ధ్య కార్మికులకు కనీసవేతనాలు నిర్ణయించి చెల్లించాలని కోరారు. జూన్ నెల నుండి ఏరియర్స్ చెల్లించాలని లేదంటే జనవరి నెలలో నిర్వధికంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఖమ్మం జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వై విక్రం,యర్రా శ్రీనివాస్, ఎఐటియుసీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సీతామహాలక్ష్మి, ఐఎఫ్ టియు నాయకులు ఆవుల అశోక్,ఆడెపు రామారావు, కంకణాల శ్రీనివాస్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కె. నారాయణ, టి.రాములు, నర్సింహ, సంఘమ్మ, పుష్ప, ఐయన్ టియుసి జిల్లా కార్యదర్శి శ్రీరాములు, మున్సిపల్ కార్మిక సంఘంనాయకులు యం.జయరాజు, వెంకటరత్నం, లాజరు, లత, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు షేక్ హుస్సేన్,బి పాపారావు, మహేష్, నాగమణి, సిఐటియు,నాయకులు జల్లి శ్రీను, వెంకటమణ, పద్మా, సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.