Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోవైపు సాగర్ నీరు బంద్
నవతెలంగాణ- బోనకల్
ఒకవైపు అన్నదాతలు మొక్కజొన్న సాగులో నిమగమై ఉన్నారు. మరొకవైపు ప్రభుత్వం సాగర నీటిని బంద్ చేసింది. దీంతో అన్నదాతలు సాగర్ నీటి కోసం అవస్థలు పడుతూ ఆందోళన చెందుతున్నారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్ ఆధారంగా బోనకల్లు మండల అన్నదాతలు పంటలను సాగు చేస్తున్నారు. మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా 22 గ్రామ పంచాయతీలకు చెందిన అన్నదాతల పొలాలు అన్నీ సాగర్ నీటి పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వానాకాలం పంటలో ప్రధానంగా పత్తి పంటను సాగు చేశారు. అనేక దఫాలుగా తుఫాను ప్రభావంతో వచ్చిన వర్షాలతో దాదాపు సగానికి పైగానే పత్తి పంట దెబ్బతిన్నది. ఎకరానికి 5 క్వింటాలు నుంచి 8 క్వింటాలు వరకు దిగుబడి వచ్చింది. దీంతో సగానికిపైగా అన్నదాతలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఇది ఇలా ఉండగా అన్నదాతలు మండలంలో 2,996 మిర్చి పంట సాగుచేశారు. మిర్చి పంటకు ఎర్రనల్లి, నల్లనల్లి సోకింది. దాదాపు మండల వ్యాప్తంగా మిర్చి పంట 90 శాతానికి పైగా దెబ్బతిన్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎర్రనల్లి, నల్లనల్లి సోకటంతో అన్నదాతల ఆశలు అడియాశలు అయ్యాయి. మిర్చి పంటకు ఎకరానికి సుమారు 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. మిర్చి పంట దెబ్బతినటంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు.అయినా అన్నదాతలలో ఆశలు చావలేదు. మండల వ్యాప్తంగా అన్నదాతలు మొక్కజొన్న పంటపై దృష్టి సారించారు. అనేక గ్రామాలలో పత్తి పంటను తొలగించి మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం సాగర్ నీటిని వారబందీ పేరుతో నిలిపివేసింది. అయినా అన్నదాతలు ఆగకుండా పంటపై ఆశతో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. మండల పరిధిలోని గోవిందపురం ఎల్, లక్ష్మీపురం గ్రామాల రైతులు మోటార్ల ద్వారా మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. మిగిలిన గ్రామాల రైతులు మాత్రం సాగర్ ఆధారంగానే మొక్కజొన్న పంట సాగు చేయవలసి ఉంది. సాగర్ నీరు వస్తాయనే ఆశతో కాలువల కింద అన్నదాతలు మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. ప్రభుత్వం యాసంగి లో వరి పంటను సాగు చేయవద్దని ఆదేశాలు ఇవ్వడంతో అన్నదాతలు మొక్కజొన్న పంట పై పూర్తిస్థాయిలో దష్టిసారించారు. ఒకవైపు ఆశతో మొక్కజొన్న పంట సాగు చేస్తూనే మరోవైపు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారబందీ విధానం ఎత్తివేసి ప్రతిరోజు మొక్కజొన్న పంట చేతికి వచ్చే వరకు సాగర్ నీటిని విడుదల చేయాలని మండల అన్నదాతలు ముక్తకంఠంతో కోరుతున్నారు.