Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారేపల్లి : లక్షలాధి రూపాయలు పెట్టుబడి పెట్టిన మిర్చితోటలు నిలువున ఎండిపోతుంటే రైతులు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారని వారి గోసను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనపడటం లేదని సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణలు విమర్శించారు. ఆదివారం కారేపల్లి మండలం మాణిక్యారం, పాటిమీదిగుంపు గ్రామాల్లో మిర్చి తోటలను సీపీఐ(ఎం) బృందం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ ఖరీఫ్‌లో మిర్చి ఆశలు పెట్టుకున్న రైతుకు గుబ్బరోగం, వైరస్, నల్లి తెగులు కోలుకోలేని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెగుళ్లతో ఇబ్బందులు పడుతున్న రైతుకు సస్య రక్షణ చర్యలపై సలహాలు ఇప్పించే ప్రయత్నం చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీస రైతును ఆదుకునే చర్యలు చేపట్టటంలో తాత్సర్యం చేయటం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెగుళ్లతో ఎకరాలకు ఎకరాలు మిర్చి తోటలను రైతులను దున్ని ప్రత్యామ్నాయ పంటలను వేస్తున్నారన్నారు. కౌలు రైతు పరిస్ధితి మరింత దారుణంగా తయారైందని, పంట పెట్టుబడి రూ.లక్ష తో పాటు అదనంగా ఎకరా కౌలు రూ.25 వేలు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం మేలుకోని మిర్చి వేసి నష్టపోయిన రైతుకు రూ.లక్ష, కౌలు రైతుకు అదనంగా కౌలు పైకం ను పరిహారంగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సహకారం అందిచాలన్నారు. మిర్చి రైతును ఆదుకోవాలని డిమాండ్ తో 20వ తేదిన ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాకు రైతులు తరలి రావాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) మండలకార్యదర్శి కే.నరేంద్ర, మండల నాయకులు దాేరావత్ సైదులునాయక్ పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : ప్రకృతి వైపరీత్యంతో తామర పురుగు ఉధృతికి మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్న నేప థ్యంలో పంటనష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి గొల్లపూడి కోటేశ్వరరావు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం గ్రామంలో గల మిర్చి తోటలను సిపిఎం ఆధ్వర్యంలో పరిశీలించారు. కార్యక్రమంలో నాయ కులు నల్లమోతు హనుమంతరావు, షేక్ జానీ, అనుమోలు వెంకటేశ్వరరావు, ఎర్రమల వెంకట నారాయణ రెడ్డి, కిషోర్, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, అయ్యవారిగూడెం సొసైటీ డైరెక్టర్ గొల్లపూడి శ్రీ హరి నారాయణ తదితరు లు పాల్గొన్నారు.
కామేపల్లి : మిరప తోట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎకరానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ డిమాండ్ చేశారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని లాలియ తండ, మద్దులపల్లి గ్రామాలలో నల్లీ పురుగుతో మిరప పంట తీవ్రంగా నష్టపోయిన తోటలను సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో సిపిఎం కామేపల్లి మండల కార్యదర్శి అంబటి శ్రీనివాస్‌రెడ్డి, మండల కమిటీ సభ్యులు రామా, రవి, ఉప్పతల వెంకన్న, అడప ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు
మధిర : మండలంలో సీపీఐ(ఎం) బృందం ఆధ్వర్యంలో మిర్చి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి మందా సైదులు మాట్లాడుతూ మిర్చి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని, ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా పరిగణించి మిర్చి రైతులను ఆదు కోవాలని, ఎకరానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు మద్దాల ప్రభాకర్, నాయుడు శ్రీరాములు, నారి శెట్టి సీతారాములు, కె.నరసింహారావు పాల్గొన్నారు.
కొణిజర్ల : ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాల్లో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిందని, తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతులకు ప్రకృతి విపత్తుతో జరిగిన నష్టంకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ఎకరాకు లక్ష రూపాయలు చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మిర్చి రైతుల ధర్నాకు రైతులు పాల్గొన్ని జయప్రదం చేయాలని అని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళ పల్లి కష్ణ పిలుపు ఇచ్చారు, ఆదివారం మండల పరిధిలోని సింగ రాయపాలెం గ్రామంలో మిర్చి రైతులు ఖమ్మం ప్రదర్శన జయప్రదం చేయాలని ప్రదర్శన నిర్వహించి, గ్రామ సెంటర్ లో ఆందోళన నిర్వహిం చారు. కార్యక్రమంలో రైతు సంఘం కొణిజర్ల మండల నాయకులు దొడ్డపనేని కృష్ణార్జున్ రావు, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శులు మిద్దె రామారావు, గాదె వెంకటరెడ్డి, ఖాసిం బేగ్, సురభి బాజరు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు
తిరుమలాయపాలెం : తెల్ల దోమ, నల్ల దోమ, నల్ల నల్లి చీడపీడల వలన దెబ్బతిన్న మిర్చి పంట రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అన్నారు. తిరుమలాయపాలెం గ్రామంలో మిర్చి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే దశలో వైరస్ సోకి నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మిర్చి నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తిప్పల పుష్పావతి, నాయకులు మద్దినేని శ్రీనివాసరావు, ముత్తయ్య, బచ్చలకూర రాములు, వెంకటేష్ పాల్గొన్నారు.