Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
అంగన్వాడీ వ్యవస్థ సమర్థవంతంగా నడపడానికి బదులు వదిలించుకోవడానికి ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తున్నారని, కేంద్ర బీజేపీ తెచ్చిన నూతన విద్యా విధానంలో భాగమే తప్ప మరొకటి కాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జే.రమేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిలకర పద్మలు అన్నారు. సోమవారం అంగన్ వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ కలక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుండి భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది.
యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో 58 శాతం అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని తెలిపారు. అద్దె భవనాలలో నడుస్తున్న కేంద్రాలకు నిధులు కేటాయించి, పటిష్టం చేయాలన్నారు. పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు, పని చేసే సిబ్బందికి ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం రద్దు అయితే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఇప్పటికే 2017 నుండి గ్యాస్ బిల్లులు, ఇంటి అద్దెలు, టీఏ, డీఏలు బకాయిలున్నాయని, వీటికి వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన జీతాలు స్వాగతిస్తూనే, కనీస వేతనం రూ.21వేలు ఇచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నూతన విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముట్టడికి సిద్దమవుతున్నామని హెచ్చరించారు.
స్పందించిన కలక్టర్...డీడబ్యూఓ
నూతన విద్యావిధానం ప్రభుత్వ పాలసీ అని, దీనివల్ల మీరు చెబుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని, జిల్లా పరిధిలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తామని కలక్టర్ అనుదీప్ హామీ ఇచ్చారు. జిల్లా పరిధిలో పెండింగ్‌లో ఉన్న గ్యాస్ బిల్లులు, ఇంటి అద్దెలు, టీఏ, డీఏలకు నిధుల కోసం కమిషనర్‌తో మాట్లాడి పరిష్కారం చేస్తామని డీడబ్ల్యూఓ వరలక్ష్మీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి, గద్దల శ్రీను, గూడెపూరి రాజు, కొత్తగూడెం పట్టణ నాయకులు భూక్యా రమేష్, డి.వీరన్న, అంగన్వాడీ జిల్లా నాయకులు పద్మ, రాధ కుమారి, విజయశీల, రాజ్య లక్ష్మి, ఫాతిమా, శైలజ, సూరమ్మ, వెంకటరమణ తదితరులు నాయకత్వం వహించారు.