Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ఇంటింటికీ కేసీఆర్, గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మంగళవారం సాయంత్రం ఆళ్ళపల్లి మండలం బోడాయికుంట, మర్కోడు గ్రామాలలో పర్యటించి, ప్రజా సమస్యలను నేరుగా అడిగితెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి జిల్లా ఉన్నతాధికారులతో చరవాణిలో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు. అందులో భాగంగానే మిషన్ భగీరథ నీళ్లు బోడాయికుంట గ్రామానికి రావట్లేదని ప్రజలు చెప్పటంతో వెంటనే జనవరి 5 లోపు ప్రజల నీటి సమస్య పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు చెప్పారు. వేతనం నెలా నెలా రావట్లేదని విధులు సక్రమంగా నిర్వహించకుండా, ప్రజలకు నీళ్లు రాకుండా చేయడం సరికాదని, అలా చేస్తున్న వర్కర్లను తొలగించి, కొత్తవారిని తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు, వారి పై కేసులు నమోదు చేయాలని స్థానిక సీఐ బి.రాజును సూచించారు. గ్రామ సమీపంలో ఉన్న వాగు పై వంతెన, బీటీ రోడ్డు సమస్యలు తీర్చాలని పలువురి వినతులు స్వీకరించారు. వాటిని ఈ సీజన్లో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోడాయికుంట గ్రామానికి చేరే క్రమంలో మార్గమధ్యంలో ఉన్న వాగు దాటుతున్న సమయంలోనే కొమరం కనకయ్య అనే రైతు 97 మొక్కజొన్న టిక్కీలు వాగు దాటుతున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో దాదాపు సగం బస్తాలు వాగునీటిలో పడిపోయాయి. ఈ దశ్యాన్ని స్వయంగా చూసిన ప్రభుత్వ విప్ కు ఆ గ్రామ సమస్య చెప్పకనే చెబుతోంది. రైతు బీమా రాని రైతు ఫిర్యాదు మేరకు వివరాలు తెలుసుకుని బీమా వచ్చేలా చేయమని స్థానిక వ్యవసాయాధికారి అశోక్ కు చెప్పారు. అలాగే అడవిరామారం గ్రామంలో త్రాగునీటి, రోడ్డు సమస్యలు సర్పంచ్ పాయం శ్రీదేవి తెలపడంతో సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. అనంతరం మర్కోడు గ్రామంలో చేరుకుని 14 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. జిన్నెలగూడెంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ట్రాన్స్ కో ఏఈ రవికి సూచించారు. స్థానికులు పలువురు వినతులు ఇవ్వటంతో స్వీకరించి, పరిష్కారానికి హామీ కల్పించారు. మర్కోడు గ్రామంలో పురవీధుల్లో రూ. 5,00,000లతో మంజూరైన రెండు సీసీ రోడ్లను అధికారికంగా ప్రారంభించారు.