Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశంలో బీజేపీ చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకించాలని, రైతాంగ పోరాట స్ఫూర్తిని పోరాటంలో కొనసాగించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్ అన్నారు. గురువారం కొత్తగూడెంలో సీఐటీయూ పట్టణ మహాసభ జరిగింది. ముందుగా సీఐటీయూ సీనియర్ నాయకులు గాజుల రాజారావు జెండాను ఆవిష్కరించారు. ఈ సదర్భంగా జరిగిన మహాసభలో ఏజే మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఎల్ఐసీ బ్యాంకింగ్, సింగరేణి టెలికం, రైల్వే నౌక విమానయానం, నవరత్నాలు లాంటి ప్రభుత్వరంగ సంస్థలను, ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అంబానీలకు కారుచౌకగా కట్టబెట్టిందని విమర్శించారు. బీజేపీ చేస్తున్న అడ్డగోలు పనులను యావత్ కార్మికవర్గం, వ్యతిరేకించాలని కోరారు. రానున్న కాలంలో కార్మిక చట్టాల ఉల్లంఘన, రైతు చట్టాలు లేబర్ చట్టాలు ఎత్తి వేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలకు, కార్మిక వ్యతిరేక చర్యలను సంవత్సరంపాటు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని, కార్మికవర్గం ఉద్యమించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలో జనవరి 27, 28, 29 తారీకుల్లో కొత్తగూడెం పట్టణంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయని, ఈ సమావేశాల్లో జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొని తదితర అంశాలపైనా తీర్మానాలు చర్చలు జరుగుతాయని, ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం అన్ని రంగాల కార్మికులు కృషి చేయాలని ఆయన కోరారు.
అలాగే ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు మాట్లాడుతూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 12 గంటల పని విధానాన్ని తిరిగి అమలు చేస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. జునుమాల నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.వీరన్న, లిక్కి బాలరాజు, భూక్య రమేష్, అంబాల దుర్గమ్మ, రింగు వెంకటయ్య, పి.జాకబ్ తదితర రంగాల నుంచి కార్మికులు పాల్గొన్నారు.