Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మిర్చి తోటలకు జెమినీ వైరస్, ఎండు తెగులు, కొమ్మ కుళ్ళు తెగులు సోకిందని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని మద్దులపల్లి, తల్లంపాడు, పొన్నెకల్లు, తెల్దారుపల్లి, యం.వెంకటాయపాలెం, కాచిరాజు గూడెం, అరేంపుల, ఆరేకొడు, ముత్తగూడెం, గుదిమళ్ళ గ్రామాల్లో శనివారం తెగుళ్లకు గురైన మిర్చి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడారు. ప్రభుత్వం సర్వే చేసి నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. చేతికొచ్చిన పంట తెగుళ్ల బారిన పడి దెబ్బతినడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులకు పరిహారం ఇవ్వకపోతే అన్ని వర్గాల రైతులను సమీకరించి ప్రభుత్వంపై పోరాటాలు, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల శ్రీనివాసరావు, పి.సంగయ్య, పి.మోహన్ రావు, ఉరడీ సుదర్శన్‌రెడ్డి, యామిని ఉపేందర్, తోట పెద్ద వెంకటరెడ్డి, కోటి శ్రీనివాసరావు,పెంట్యాల నాగేశ్వరరావు, కర్లపూడి వెంకటేశ్వర్లు, సిలివేరు బాబు, నువ్వుల నాగేశ్వరరావు, గింజుపల్లి మల్లయ్య, పల్లె శ్రీనివాసరావు, వట్టికోట నరేష్, సాల్వే వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కొణిజర్ల( ఏన్కూర్) : మిర్చి పంట సాగు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయామని, తమ మిర్చి తోటలను కనీసం అధికారులు పరిశీలించి సర్వే కూడా చేయటం లేదని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం మండల పరిధిలోని జన్నారం గ్రామంలో మిర్చి సాగు చేసిన కౌలు, మహిళా రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ కౌలు రైతులు పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని, ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి మూపై ఐదు వేల రూపాయలు కౌలు ముందస్తుగా చెల్లించి పంట సాగు కోసం మరో లక్ష రూపాయల పైగా పెట్టుబడి ఖర్చు పెట్టి మిర్చి పంట నిలువునా ఎండిపోయి రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నా ప్రభుత్వం మిర్చి పంట నష్టం అంచనా వ్యవసాయ శాఖ ద్వారా చేయడం లేదన్నారు. పంట పూర్తిగా దెబ్బతిన్న తర్వాత శాస్తవ్రేత్తల బృందం జిల్లాలో పర్యటించడం వలన రైతులకు ఉపయోగం లేకుండా ఉందన్నారు. కార్యక్రమంలో ఏన్కూర్ సోసైటి వైస్ చైర్మన్ రెగళ్ళ తిరుమలరావు, రైతు సంఘం మండల నాయకులు స్వర్ణ కృష్ణారావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు, జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్, సొసైటి మాజీ డైరెక్టర్ తాళ్ళ సుశీల, పాలపాటి తిరుపతమ్మ, రావేలు, రాధా, మరియమ్మ, కమల, భవానీ, నేల్లపట్ల వెంకటేశ్వరరావు, జమ్మి మరియదాసు, జయరాజ్, నర్సింహారావు, వెంకన్న, పౌలు, ఏసు వెంకయ్య పాల్గొన్నారు.
కారేపల్లి : మిర్చి పంటకు సోకిన తెగుళ్లతో రైతు కోలుకోలేని దెబ్బతగిలిందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర అన్నారు. శనివారం కారేపల్లి మండలం మాధారంలో మిర్చి పంటలను సీపీఐ(ఎం) నాయకలు పరిశీలించారు. రైతుల బాధలను తెలుసుకున్నారు. ఈసంధర్బంగా నరేంద్ర మాట్లాడుతూ మిర్చి తోటలకు ప్రయివేటు వ్యాపారస్తుల నుండి వడ్డీలకు, పురుగుమందుల షాపుల నుండి అరువుకు మందులు తీసుకవచ్చి పెట్టుబడి పెడితే పెట్టుబడి అంతా నేలపాలైందన్నారు. ఆదుకోవల్సి ప్రభుత్వం కనీసం అధికారులతో సర్వే కూడా చేయించ లేదన్నారు. రైతు బంధు ఇస్తే అన్ని సమస్యలను పరిష్కారంగా భావిస్తుందని ఇది సరికాదన్నారు. మిర్చి రైతును యుధ్దప్రాధిపదికన ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు తుమ్మోజు రాంమ్మూర్తి, పాపినేని నాగేశ్వరరావు, పోట్లకాయల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మధిర :మధిర మండలం వ్యాప్తంగా మిర్చి రైతులు పంటలకు పెట్టుబడి పెట్టి కొత్త వైరస్ సోకి తోటలు ఎండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతుకు ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం చెల్లించి రైతు ఆత్మహత్యలను నివారించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కృష్ణాపురం గ్రామంలో శనివారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో తేజవత్ నాగేశ్వర్, శ్రీదేవి, బాలి, ఆశీర్వాదం, అనిల్, భూక్యా నాగేశ్వర్, లాల్ తదితరలు పాల్గొన్నారు.
పెనుబల్లి : మిర్చి వైరస్‌ను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని వ్యకాస మండల కార్యదర్శి చీమట విశ్వనాథం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు డిమాండ్ చేశారు. పార్థసారథిపురం గ్రామంలో మిర్చి రైతులతో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కుంజా రాములు, పోతురాజు, సిహెచ్ నరసింహారావు, రాజమ్మ, రాణి పాల్గొన్నారు.