Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- సత్తుపల్లి సంప్రదాయాన్ని నిలబెట్టారు:
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- స్థానిక ప్రజా ప్రతినిధులకు నావంతు సహకారం : ఎమ్మెల్సీ తాతా మధు
నవతెలంగాణ- సత్తుపల్లి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా నిబద్ధతతో ఓట్లువేసి అభ్యర్థి గెలుపుకు కృషి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద మనకు గుర్తింపు తెచ్చిపెట్టిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం స్థానిక మాధురి ఫంక్షన్ హాలులో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుకు అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. ఈ నిబద్ధత కారణంగానే జిల్లాస్థాయి పదవిని సత్తుపల్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టబెట్టారని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది నీతిభాహ్యమైన పద్ధతులకు పాల్పడ్డారన్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి నష్టం కలిగేలా దుర్మార్గపు ఆలోచనలకు తెరలేపారన్నారు. అయినా వారి ఆటలు మన నియోజకవర్గంలో వారి ఆటలు సాగలేదన్నారు. ఈ విషయమై అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. తాను టీడీపీలో ఉన్న సమయంలో తుమ్మల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయమన్నారు. సున్నితంగా తిరష్కరించడం జరిగిందన్నారు. పనిచేస్తున్న సంస్థకు ద్రోహం చేసేంత దుర్బుద్ధి కలగలేదన్నారు. పార్టీలో ఉంటూ అదే పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలనుకోవడం అవివేకమవుతుందన్నారు. కేవలం సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికే తాను టీఆర్ఎస్లోకి రావడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో 50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సత్తుపల్లిలో సీసీ రోడ్డులేని వీధులు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. కేటీఆర్ ప్రకటించిన రూ. 30కోట్లు త్వరలో మంజూరు కానున్నట్లు సండ్ర తెలిపారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్థికి ఓట్లేసి సత్తుపల్లి సంప్రదాయాన్ని నిలబెట్టారన్నారు. కొంతమంది పార్టీలో ఉంటూ నష్టం జరిగే కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలతోనే ఇబ్బందులుండేవన్నారు. ఇప్పుడు మనపార్టీ వాళ్లనే ఒకకంట కనిపెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పార్టీలో ఇమడలేకపోతే వూరే పార్టీలోకి వెళ్లాలే తప్ప నష్టం చేసే కార్యక్రమాలను ప్రజలు గమని స్తుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ గతంలో లాగా కాకుండా ఎమ్మెల్సీగా స్థానిక ప్రజాప్రతినిధులకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, డీసీఎంఎస్ ఛైర్మెన్ శేషగిరిరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, జెడ్పీటీసీలు కూసంపూడి రామారావు, చెక్కిలాల మోహనరావు, ఎంపీపీలు దొడ్డా హైమవతిశంకర రావు, లక్కినేని అలేఖ్యవినీల్, పగుట్ల వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు గాదె సత్యనారాయణ, దొడ్డా శంకరరరావు, మండల, పట్టణ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, ఎస్కే రఫీ, ఐదు మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.