Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మరియు సత్తుపల్లి సింగరేణి భూ నిర్వాసితులకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబులు డిమాండ్ చేశారు. సోమవారం భూ నిర్వాసితులతో కలిసి నున్నా నాగేశ్వరరావు, బొంతు రాంబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, తాతా భాస్కర్ రావు, జాజిరి శ్రీనివాస్ రావు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ గౌతమ్‌ను కలిసి భూ నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. అనంతరం టిటిడిసిలో అదనపు కలెక్టర్ మధుసూదనరావు, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాధ్ నిర్వహించిన గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారి భూ నిర్వాసితుల సమావేశంలో నున్నా నాగేశ్వరరావు, బొంతు రాంబాబులు పాల్గొని మాట్లాడుతూ వైరా ప్రాంతంలో ఎకరం భూమి మార్కెట్ విలువ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఉందని, మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుని భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారి అధికారులు ప్రాజెక్టు పూర్తి వివరాలను బహిరంగపర్చాలని, రైతుల్లో కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటన్నింటిని భూ సేకరణ అవార్డు ప్రకటన కంటే ముందే నివృత్తి చేయాలని, నిర్వాసితుల భూమి గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారికి ఇరువైపుల మిగిలి ఉన్నట్లయితే అలాంటి భూములలో సాగు సమస్య వస్తుందని, ఇప్పటికే డొంక రహదారులు వున్న అన్ని చోట్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారి అండర్ పాస్ ఇవ్వాలని, స్థానిక ప్రజల అవసరాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సత్తుపల్లి ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం కోమేపల్లి భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలన్నారు. 2008లో భూ సేకరణ అవార్డు ప్రకటించి, రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా డిపాజిట్ చేసి ఇప్పుడు అవే డబ్బులు ఇవ్వాలని చూడడం దారుణమని, ఆనాడే రైతులు పరిహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తి కోర్టు కేసు పేరుతో పరిహారం చెల్లించకుండా జాప్యం చేసి, ఆ ధరను ఇప్పుడు రైతులకు ఇవ్వచూపడం సరికాదని, కోమేపల్లి భూ నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం ప్రస్తుత భూ సేకరణలో చెల్లించే పరిహారం కోమేపల్లి భూ నిర్వాసితులకు చెల్లించకుండా భూమి స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఉద్యమం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రైతులు వెల్డి ప్రసాద్, సంక్రాంతి రవి, శ్రీదేవి, వాసిరెడ్డి రవి, రామారావు, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.