Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది కామ్రేడ్స్ కదం తొక్కారు. పోడు పోరాటం...సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు అండగా ఆందోళనలు నిర్వహించారు. దాదాపు 14 నెలల పాటు సాగిన నూతన వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిర్వహించిన నిరసనల్లో భాగమయ్యారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, నిరుద్యోగ, మహిళా ఉద్యమాలనేకం నిర్వహించారు. వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. పోడు రైతుకు దన్నుగా నిలిచారు. కొణిజర్ల, సింగరేణి, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, పినపాక, ఇల్లెందు...ఏజెన్సీలోని ఏ ప్రాంతంలో పోడు రైతు ఇబ్బందులు పడితే అక్కడ కామ్రేడ్స్ పిడికెళ్లెత్తారు. అక్టోబర్ 6వ తేదీన అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు నిర్వహించిన సడక్ బంద్ సక్సెస్ కావడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. పోడుదారులకు హక్కు పత్రాల దిశగా చర్యలు చేపట్టకా తప్పలేదు.
- పోరుపథంలో...
వామపక్షాలు సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీతో కలిసి కాంగ్రెస్ వివిధ పోరాటాల్లో భాగమైంది. టీడీపీ, ఇంటిపార్టీ, వైఎస్ఆర్టీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు అంశాల వారీగా పోరాటాలకు మద్దతు తెలిపాయి. వ్యవసాయ బిల్లులపై పోరాటంలో తొలుత మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఆ తర్వాత వెనక్కు తగ్గడం చర్చనీయాంశమైంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ వైఖరీకి నిరసనగా ఉద్యమపార్టీలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. టీఆర్ఎస్ వానకాలం ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టకుండా యాసంగి వరిపై ధర్నాలు, బీజేపీకి చావుడప్పుల వంటివి చేపట్టడం చర్చనీయాంశమైంది. బీజేపీ, టీఆర్ఎస్ల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 'చావుడప్పు' మోగించాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. తెగుళ్లతో మిర్చి గుల్లవుతున్న నేపథ్యంలో సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఎకరానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ తెగుళ్ల కారణంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వివిధ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా సేకరించిన భూముల నిర్వాసితులకు ఇచ్చే పరిహారం అరకొరగా ఉండటం, అది కూడా సకాలంలో ఇవ్వకపోవడంపై నిరసనలు కొన సాగాయి. ఈ ఉద్యమాలకూ సీపీఐ(ఎం), న్యూడెమోక్రసీ, సీపీఐ వంటి పార్టీలు ప్రాతినిధ్యం వహించాయి. కామంచికల్, ఖమ్మం నగరంలో చెత్త డంపింగ్పైనా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. కామంచికల్కు ఖమ్మం చెత్తను తరలించొద్డని దాదాపు నెలరోజుల పాటు ఆరు గ్రామాల ప్రజలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి నిర్వహించిన నిరసన దీక్షల విజయవంతానికి సీపీఐ(ఎం) ప్రధాన భూమిక పోషించింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు బాధితులకు అండగా నిలబడింది. పోడు విషయంలోనూ...వ్యవసాయ చట్టాల రద్దు విషయంలోనూ...ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించింది.
- ప్రజలకు అండగా సీపీఐ(ఎం)
ఈ ఏడాది కాలంలో సీపీఐ(ఎం) అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించింది. పార్టీ అనుబంధ సీఐటీయూ ఆధ్వర్యంలో మొత్తం 12 డిమాండ్స్ సాధన, సింగరేణి బగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బగ్గు గనుల్లో పాదయాత్ర నిర్వహించింది. భద్రాద్రి పరిరక్షణ పేరుతో సీపీఐ(ఎం) భద్రాచలం సమస్యలపై పాదయాత్ర చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. పోడుదారులు జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ప్రదర్శన నిర్వహించారు. సడక్ బంద్‌ను సైతం సఫలీకృతం చేశారు. ఖమ్మం జిల్లాలోనూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌ను కొనసాగించాలని ఉద్యమం సాగింది. సెప్టెంబర్ 14వ తేదీన మైథిలీ శివరామన్నగర్లో ఐద్వా జిల్లా 11వ మహాసభలు జరిగాయి. నవంబర్ 29, 30 తేదీల్లో వేదగిరి శ్రీనివాసరావు నగర్లో పార్టీ జిల్లా 21వ మహాసభలు నిర్వహించారు. నున్నా నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరోనా లాక్డౌన్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసోలేషన్ సెంటర్లు ఆదర్శంగా నిలిచాయి. ఖమ్మంలో సుమారు 150 మంది కరోనా బాధితులు ఈ సెంటర్లో క్వారంటైన్ అయ్యి కోలుకుని బయటకు వెళ్లారు. అలాగే భద్రాచలంలో 100 మంది వరకు ఐసోలేషన్‌లో ఉండి...కోలుకున్నారు. ఇక కరోనా బారిన పడి హౌంక్వారంటైన్ అయిన వారికి సైతం రోజుకు 350కి పైగా భోజనాలు, మెడిసిన్ వంటి వాటిని సమకూర్చారు. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు సైతం పార్టీ కార్యకర్తలు నిర్వహించారు. ఖమ్మంలో కరోనా బాదితులను ఐసోలేషన్ కేంద్రానికి తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని సైతం కల్పించారు. ఇలా ప్రజలకు అండగా ఉండటంలో సీపీఐ(ఎం) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీలు సేవా దృక్పథం ప్రదర్శించాయి. బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన ప్రభుత్వాలు ఈ ఐసోలేషన్ కేంద్రాలను మూసివేయించేందుకు విఫలయత్నం చేశాయి. అనేక రకాల ఆటుపోట్ల నడుమ సీపీఐ(ఎం) నాయకత్వం, కార్యకర్తలు ప్రదర్శించిన సేవా దృక్పథం, పోరాట స్ఫూర్తి విమర్శకులకు సైతం గుణపాఠంగా చెప్పవచ్చు.