Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
రాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వంలో తిరిగి అధికారం చేపట్టాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్న ఈ సమయంలో పార్టీలో కొందరి బాధ్యతారాహిత్యాన్ని, క్రమ శిక్షణారాహిత్యాన్ని పార్టీ సహించబోదని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరించారు. సోమవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన వైరా నియోజక వర్గ అభినందన సభలో సన్మాన గ్రహీత తాతా మధు మాట్లాడారు. పార్టీ అధినాయకుడు కెసిఆర్ తనను నమ్మి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం, అదే నమ్మకం, విశ్వాసంతో జిల్లా ప్రజా ప్రతినిధులు తన గెలుపుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరో సంవత్సరంన్నరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయని, తిరిగి కెసిఆర్ అధికారం లోకి రావాలంటే వైరా నియోజకవర్గంలో రాములన్న మళ్లీ గెలవాలని అందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని కోరారు.చాలా మంది అంటున్నట్లు రాములన్న కరకుగా ఉండాలని, చిన్న చిన్న తేడాలను సరిచేసుకుని నియోజకవర్గాన్ని తన గ్రిప్పులో ఉంచుకోవాలని చూసించారు. అభినందన సభలో కొంతమంది మాట్లాడిన తీరును ఆయన సున్నితంగా ఖండించారు. ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం పెంచాలని కోరగా రాష్ట్రం లో జరిగిన మంచిపనులు, విజయాలు ప్రచారంలో పెట్టని వారు, ఒకటీ అర జరగని పనులను గురించి మాట్లాడటం బాధాకరం అన్నారు. కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వంలో గౌరవ వేతనం 700 రూపాయలు ఇవ్వగా, ఇప్పుడు 5 వేలకు పెంచి ఇవ్వటమే గాక మరలా 30శాతం పెంచి ఇస్తున్న విషయాన్ని మరచి మాట్లాడటం సరికాదని అన్నారు. వైరా నియోజక వర్గంలో ఎమ్మెల్యే కరకుగా ఉండాలని ఎమ్మెల్సీ అనటంలో మర్మగర్భంగా విమర్శ దాగి ఉందని గుస గుసలు ప్రారంభం అయినవి. మీడియా ఉందని గుర్తు చేయగా ఉన్నా ఫర్వాలేదు, ఏం రాసినా ఫర్వాలేదు, ఉన్న విషయాలనే చెబుతున్నానని అన్నారు. తొలుత ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయం సాధించటం గర్వకారణమని అన్నారు. సభలో మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూత కాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఆత్మా చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జునరావు, కొణిజర్ల, కారేపల్లి, ఏనుకూరు, జూలూరుపాడు మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.